జిల్లా జట్టుతో ఎండీసీఏ ప్రతినిధులు
-
వరుస విజయాలతో దూసుకెళ్తున్న పాలమూరు
-
చివరి లీగ్‌లో 72పరుగల తేడాతో ఆదిలాబాద్‌పై ఘనవిజయం
-
రాణించిన రహీం, ఖయ్యుం, గణేష్
-
రేపు సెమీస్‌లో మెదక్‌తో ఢీ
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్–19 టోర్నీలో జిల్లా జట్టు దూసుకెళ్తోంది. వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ సాధించి, గ్రూప్–ఏలో టాపర్‌గా నిలిచింది. గురువారం జిల్లాస్టేడియంలో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌లో పాలమూరు 72పరుగుల తేడాతో ఆదిలాబాద్‌ను చిత్తు చేసింది. టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాలమూరు జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. టాపార్డర్, మిడిల్డార్ విఫలమైంది. మంజునాథ్ (31), హర్షవర్ధన్ (27)లు మాత్రమే మోస్తారుగా రాణించారు. 153 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుకు ఆల్‌రౌండర్ అబ్దుల్ రహీం (42, 46 బంతుల్లో 2 ఫోర్లు), అర్జున్ (21, 25 బంతుల్లో 2 ఫోర్లు) ఏడు వికెట్‌కు 55పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆదిలాబాద్ బౌలర్లు సైఫ్ అలీ నాలుగు, ప్రదీప్ రెండు వికెట్లు తీసుకున్నారు. 216పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలాబాద్ ప్రారంభంలోనే ఓపెనర్ జగదీశ్‌రెడ్డి (4) వికెట్‌ను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ ప్రదీప్ (52), సైఫ్ అలీఖాన్(29) రెండో వికెట్‌కు 44పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత జిల్లా బౌలర్లు ధాటికి మిగతా బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనై వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో ఆ జట్టు 37.5 ఓవర్లలో 143పరుగులకే కుప్పకూలింది. జిల్లా బౌలర్లలో ఖయ్యుం, గణేశ్‌లు మూడేసి వికెట్లు తీసుకున్నారు.
దేశానికి ప్రాతినిధ్యం వహించాలి
రాష్ట్ర క్రికెట్ క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని టూటౌన్ సీఐ డీవీపీ రాజు ఆకాంక్షించారు. ఉదయం ఆయన మహబూబ్‌నగర్–ఆదిలాబాద్ మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ క్రీడలు ఆడటంతో పాటు చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. క్రమశిక్షణ, ఏకాగ్రతతో ఆడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఈసీ సభ్యుడు కృష్ణమూర్తి, కోచ్‌లు అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్ తదితరులు పాల్గొన్నారు.
రేపు సెమీస్..
టోర్నీలో గ్రూప్–ఏ నుంచి మహబూబ్‌నగర్, నిజామాబాద్, గ్రూప్–బీ నుంచి మెదక్, వరంగల్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. శుక్రవారం విశ్రాంతి దినం. శనివారం తొలి సెమీఫైనల్లో మహబూబ్‌నగర్ జట్టు మెదక్‌తో జిల్లాస్టేడియంలో తలపడనుంది. జడ్చర్లలో జరిగే రెండో సెమీస్‌లో వరంగల్‌తో నిజామాబాద్ ఢీకొంటుంది.
ఉత్కంఠ పోరులో నెగ్గిన నిజామాబాద్
జడ్చర్ల టౌన్: రెండు విజయాలతో నిజామాబాద్ జట్టు సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గురువారం జడ్చర్ల ఎర్రసత్యం స్మారక క్రీడామైదానంలో ఉత్కంఠగా సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నిజామాబాద్ ఒక వికెట్ తేడాతో కరీంనగర్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరీంనగర్ జట్టు 39.4ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయింది. నిజామాబాద్ బౌలర్లలో శ్రావణ్, నిఖిల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. 130 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన నిజామాబాద్ జట్టు 31.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. జట్టులో కమలేష్ (27) ఒక్కడే రాణించాడు. కరీంనగర్ బౌలర్లలో ఆకాష్‌రావు ఐదు, రాహుల్ 3 వికెట్లు తీసుకున్నారు.