మాతాశిశు ఆరోగ్య కార్యక్రమాలు విస్తృతం చేయాలి
Published Sun, Nov 27 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ : మాతాశిశు ఆరోగ్య పరిరక్షణా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్‌వైజర్లతో శనివారం నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని మహిళా శిశు సంజీవిని ప్రాజెక్ట్ అమలు, ఏజెన్సీ మండలాల్లో పోషకాహార లోపాల నివారణ, తల్లీబిడ్డల సంరక్షణ అంశాలపై సమీక్షించారు. ఏజెన్సీ ప్రాంతంలోని మాతా శిశు ఆరోగ్య సేవల వాస్తవ పరిస్థితిని మదింపు చేసి, వాటిని మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ వారం నాలుగు రోజుల పాటు ఏజెన్సీ మండలాల్లో సీడీపీఓలు జరుపుతున్న క్షేత్రస్థాయి పర్యటనలు, వాటిలో గుర్తించిన అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తల్లీ, బిడ్డలు, గర్భిణుల ఆరోగ్యం, పోషకాహారం, వైద్యం అంశాలలో గిరిజనుల్లో సంప్రదాయంగా కొనసాగుతున్న అలవాట్లు, వాటిలో కొన్నింటి వల్ల కలుగుతున్న అనర్థాలను గుర్తించి వాటిని గిరిజనులు విడనాడేలా అవగాహన కల్పించేందుకు ఏజెన్సీ ప్రాంత అంగన్ వాడీ కార్యకర్తలకు, సూపర్‌వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. గిరిజనులకు వివరించేందుకు ఈ అంశాలపై ప్రత్యేక వీడియో డాక్యుమెంటరీ రూపొందించి సంతలు, జాతరలు వంటి చోట్ల ప్రదర్శించాలన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో అందించే ఆహార మెనూలో గిరిజనులు ఇష్టపడే తృణధాన్యాలు, చిరుధాన్యాలను చేర్చాలని సూచించారు. ఏజెన్సీ అంగన్ వాడీ కేంద్రాల్లో సక్రమంగా విధులకు హాజరుకాని కార్యకర్తలు, సూపర్‌వైజర్లపై చర్యలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంజీవిని జిల్లా కో–ఆర్డినేటర్ హెచ్.శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ నాగరత్నం, సీడీపీఓలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement