♦ ఈ నెల 13న హైదరాబాద్‌లో సదస్సు
♦ ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్
తెయూ(డిచ్‌పల్లి): సామాజిక తెలంగాణ కోసం బహుజనులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సామాజిక తెలంగాణ సాధన సమితి కన్వీనర్ ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్ పిలుపునిచ్చారు. గురువా రం తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం లో కూడా బహుజనులకు సమన్యాయం దక్కడం లేదన్నా రు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో త్యాగాలు బహుజను లు చేస్తే, బహుకొద్ది మంది మాత్రమే దాని ఫలాలు అనుభవిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా అధికారంలోని ఉన్నవాళ్లు వ్యవహరిస్తు న్నారని అన్నారు. తెలంగాణలో 60 శాతం ఉన్న బీసీలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదన్నారు. ఒకటి, రెండు అగ్ర కులాలే లెక్కకు మించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నారని అన్నారు.
ఇతర నామినేటెడ్ పోస్టులు, అధికారిక పదవుల్లో సైతం అగ్ర కులాల వారినే నియమిస్తున్నారని ఆరోపించారు. నిజానికి బహుజనులు లేని ఊరు, ఉద్యమం లేదన్నా రు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నత పదవులన్నీ అగ్రకులాల వారికే అంటగడుతున్నారని అన్నారు. 1600లకు పైగా బహుజన విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తే, మిలియన్ మార్చ్‌లు, సాగర హారాలు, సకల జనుల సమ్మె చేస్తే స్వరాష్ట్రంలో అధికార బోగాలన్నీ రెండున్నర కులాల వారే అనుభవిస్తున్నారని మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేక పోవడాన్ని ఆయన తప్పు బట్టారు.
ఈ నెల 13న హైదరాబాద్‌లోని బీసీ సెం టర్‌లో ‘సామాజిక తెలంగాణ సాధించుకోవడం ఎలా’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రభంజన్‌యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి బహుజన మేథావులు, ఉద్యమకారులు హాజరై ఐక్య కార్యాచరణ రూపొందించాలన్నారు. అనంతరం సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో అధ్యాపకులు దామెర జాన్సన్, ప్రవీణాబాయి, పున్నయ్య, రమణచారి, వెంకటేశ్వర్లు, రాజారాం, విజయలక్ష్మి, దత్తహరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.