నిధులుండీ...నిర్లక్ష్యం
నిధులుండీ...నిర్లక్ష్యం
Published Fri, Jul 28 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM
– ఎంపీ నిధుల వినియోగంలోరాష్ట్రంలోనే చివరి స్థానం
- రూ.17 కోట్లున్నా పట్టించుకోని వైనం
- అంత నిర్లక్ష్యమేమిటంటూ ప్రజల ఆగ్రహం
- పట్టించుకోని ఎంపీ మురళీ మోహన్
నిధులు ఉన్నాయి...ప్రతి ఏటా ఆ నిధులకు అదనంగా జతై రెట్టింపవుతున్నాయి. గత మూడేళ్లుగా రెండు పదుల కోట్లకు చేరుకున్నాయి. పాత నిధులను కూడా వీటితో కలిపి అభివృద్ధి పనులకు వెచ్చించుకునే వెసులుబాటు ఉంది. బాధ్యత ఉన్న ఏ ప్రజా ప్రతినిధి అయినా ఏం చేస్తారు ... కనీసం తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రాంతంలోనైనా వెచ్చించి ప్రగతి పూవులు పూయిస్తారు. కానీ ఏడు శాసన సభా నియోజకవర్గాల పరిధిలో ఉన్న రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ మురళీ మోహన్ మాత్రం ఇవేవీ పట్టనట్టు వ్యవహరిస్తూ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు.
ప్రతి ఏటా ఎంపీ నిధుల కోటా కింద ఏటా రూ.5 కోట్లు చొప్పున గత మూడేళ్లలో రూ.15 కోట్లు విడుదలయ్యాయి. ఇవి కాకుండా గతంలో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మరో రూ. 2.15 కోట్లు అందనంగా వచ్చి చేరాయి. ఈ లెక్కన మొత్తంగా రూ. 17.15 కోట్లు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ.5 కోట్లు విడుదలకు సిద్ధమై ఉంది. దీంతో కలిపి రూ. 22.15 కోట్లకు చేరనుంది.
ఇన్ని నిధులు తన ఖాతాలో మూలుగుతున్నా తనకు పట్టనట్టు వ్యవహరించారు. ఇప్పటి వరకు కేవలం రూ.6.30 కోట్లు విలువైన 111 పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తూ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రూ. 2.32 కోట్ల విలువైన 36 పనులను ఇటీవల ప్రతిపాదించినవే. ఇవి కూడా పంపించకపోయి ఉంటే జిల్లాలో ప్రగతి మరింత దయనీయంగా ఉండేది. ఇక చేసిన పనుల ఖర్చు విషయానికొస్తే రూ. 3.44 కోట్లు మాత్రమే వ్యయం చేశారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలో బొమ్మూరు గ్రామంలో మహిళలు ఆర్థికంగా సాధికారిత సాధించాలన్న ఉద్దేశ్యంతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) ఇది. ఇప్పటి వరకు ఇక్కడ వేలాది మంది మహిళలు శిక్షణ పొంది ఆర్థికంగా స్థిరపడ్డారు. ప్రస్తుతం మహిళా ప్రాంగణం భవనం శిధిలావస్థకు చేరింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మూరు గ్రామం వచ్చినప్పుడు భవన సమస్యను అధికారులు వివరించారు. జిల్లా కలెక్టరు నుంచి ప్రజాప్రతినిధులందరికీ విన్నవించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు రూ.50 లక్షలతో మరమ్మతులు చేస్తే సరిపోతుందని అంచనా కూడా వేశారు. కానీ రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్‌కు ఇదేమీ పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదొక్కటే కాదు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి సమస్యలు అనేకం వెంటాడుతున్నాయి. కానీ వాటిపై ఎంపీ దృష్టి పడటం లేదు. తనకొచ్చిన ఎంపీ నిధులు మురగడం తప్ప ఉపయోగం లేకుండాపోతోంది. సహ ఎంపీలు పోటీపడి ఖర్చు పెడుతున్నా ఈయనకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా ఉండడం లేదు. అంతేలే...చుట్టం చూపుకని నియోజకవర్గానికొచ్చే ఎంపీకి సమస్యలు ఎలా పడతాయని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. తనకొచ్చిన నిధులను ఏదో ఓ రోజు తనకో, అనుయాయులకో లబ్థి చేకూరేలా ఖర్చు పెట్టేద్దామనుకుంటున్నారేమో గానీ మూడేళ్లగా వచ్చిన నిధుల జోలికి మాత్రం ఆయన పోవడం లేదు.
నిధులు విడుదల ఇలా...
ఎంపీ మురళీమోహన్‌కు ఏటా రూ.5 కోట్లు చొప్పున మూడేళ్లపాటు రూ.15 కోట్లు విడుదలయ్యాయి. ఇవి కాకుండా గతంలో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మరో రూ. 2.15 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ లెక్కన మొత్తంగా రూ.17.15 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ.5 కోట్లు విడుదలకు సిద్ధమై ఉంది. దీంతో కలిపి రూ. 22.15 కోట్లకు చేరనుంది. కానీ మురళీమోహన్‌కు చిత్తశుద్ధే లేదు. ఇప్పటి వరకు కేవలం రూ.6.30 కోట్లు విలువైన 111 పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తూ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రూ.2.32 కోట్ల విలువైన 36 పనులను ఇటీవల ప్రతిపాదించినవే. ఇవి కూడా పంపించకపోయి ఉంటే జిల్లాలో ప్రగతి మరింత దయనీయంగా ఉండేది. ఇక చేసిన పనుల ఖర్చు విషయానికొస్తే రూ. 3.44 కోట్లు మాత్రమే వ్యయం చేశారు.
ఇలా వినియోగించుకోవచ్చు...
ఈ నిధులతో తాగునీటికి, రోడ్లకు, భవనాలకు, కల్వర్టులకు, విద్యకు, విద్యుత్ సౌకర్యానికి, కుటుంబ ఆరోగ్యానికి, ఇరిగేషన్‌కు, సంప్రప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి, రైల్వే రోడ్లు, రైల్వే వంతెనలకు, శానిటేషన్‌కు, క్రీడలకు, మత్స్యసంపద అభివృద్ధికి, వ్యవసాయానికి హేండ్‌లూమ్స్‌కు, పట్టణాభివృద్ధికి ఇలా ... ఎన్నింటికో ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఈ విభాగాలకు సంబంధించిన ఏ ఒక్క సమస్య మురళీ మోహన్‌కు పట్టకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. నిధులుండీ నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement