హామీల అమలుకు పోరాటాలు
♦ కార్పొరేషన్ ఎన్నికల్లోప్రజాతీర్పును స్వాగతిస్తున్నాం
♦ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
♦ సమీక్ష సమావేశంలో ఎంపీ పొంగులేటి
కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై పోరాటాలు చేద్దామని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. - సాక్షిప్రతినిధి, ఖమ్మం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు పోరాటం సాగిద్దామని నగరంలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పొరేషన్ ఎన్నికల కో-ఆర్డినేటర్ లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికలకు నగరంలో సీఎం కేసీఆర్ పర్యటించి, అసాధ్యమైన హామీలతో ప్రజలను మభ్య పెట్టారని, టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామన్నట్టుగా భయభ్రాంతులను చేశారని విమర్శించారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించిన ప్రజలకు సేవ చేయడం ద్వారా వారి రుణం తీర్చుకుంటామని అన్నా రు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఈ ఎన్నికలపై కొంతవరకు పడిందని, పాలకుల అధికార దుర్వినియోగం తోడైందని అన్నారు. ‘‘ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు.. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు విపక్ష పార్టీల నాయకులు నన్ను సంప్రదించారు. మీ పార్టీకి (వైఎస్సార్ సీపీకి) పదికి పైగా సీట్లు వస్తాయని; మద్దతునిస్తే మేయర్, ఉప మేయర్ పదవులను పంచుకుందామని అన్నారు’’ అని చె ప్పారు. ప్రతి ఓటమి వెనుక ఒక గెలుపు ఉంటుం దన్న విషయాన్ని పోటీ చేసిన అభ్యర్థులు గమనంలో ఉంచుకుని.. ప్రజాసంక్షేమానికి కృషి చేయాలని, సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
దుష్ర్పచారం సాగిస్తున్నారు
‘‘రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రాబల్యం తగ్గిందని, ఈ పార్టీ నాయకులు త్వరలోనే వేరే పార్టీలో చేరతారని కొందరు దుష్ర్పచారం సాగిస్తున్నారు. దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను’’ అని అన్నారు. ‘‘గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పార్టీ బలమేమిటో అందరూ చూశారు. దానిని మర్చిపోయి ఇలా దుష్ర్పచారం సాగిస్తే ప్రజలు సహించరు’’ అని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలుపోటములు సహజమని అన్నారు.
సమావేశంలో 4, 32 డివిజన్ల కార్పొరేటర్లు సలువాది వెంకయ్య, దోరేపల్లి శ్వేత; పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మట్టా దయానంద్, కార్యదర్శి ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, సంయుక్త కార్యదర్శులు షర్మిలాసంపత్, సూతగాని జైపాల్; జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గుండా వెంకటరెడ్డి; పాలేరు, వైరా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు సాధు రమేష్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్; జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు బీమా శ్రీధర్, కొంగర జ్యోతిర్మయి, వంటికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి; యువజన, మహిళ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి.ముస్తఫా, కీసర పద్మజారెడ్డి, గుమ్మా రోశయ్య తదితరులు పాల్గొన్నారు.