28వ డివిజన్ టీడీపీ అభ్యర్థి మద్దినేని ధనలక్ష్మి, శాంతినాయుడు దంపతులు
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీని చావుదెబ్బ తీస్తున్నాయి. ఆ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులే నేతల పోకడలు నచ్చక బాబోయ్.. మీకో దండం అంటూ పోటీ నుంచి తప్పుకుంటున్న పరిస్థితి కొనసాగుతోంది. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉండడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్లు, సిటింగ్ అభ్యర్థులు సుముఖంగా లేకపోవడంతో కొత్త వారిని అనేక ప్రలోభాలు పెట్టి బలవంతంగా నామినేషన్లు వేయించారు. కొందరు తెలివిగా నామినేషన్లను తప్పుల తడకలుగా ఇచ్చి తిరస్కరణతో పోటీ నుంచి బయటపడితే.. ఇంకొందరు పోటీ చేయలేమంటూ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. బరిలో నిలిచిన ఇంకొందరు సైతం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. వీరి బాటలోనే మరికొందరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం తర్వాత ఆ పార్టీ నుంచి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు గుడ్ బై చెబుతుండగా, తాజాగా కార్పొరేటర్ అభ్యర్థులే పోటీ నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉండడం, టీడీపీ అభ్యర్థులకు ప్రజాదరణ లేకపోవడం వంటి పరిస్థితులను విశ్లేషించుకుంటున్నంటున్న నేతలు తప్పుకోవడానికి ఇదే తరుణం అన్నట్లుగా బయటపడుతున్నారు.
ఒక్కొక్కరుగా.. ఇంకా కొందరు
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో టీడీపీ బలంగా ఉందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న ఆ పార్టీ నేతలకు తమ్ముళ్ల అంతరంగం అంతుపట్టడం లేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో పోటీ చేయించామని చెప్పుకున్న గొప్పలు అంతలోనే నీరుగారిపోతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ సమయానికి 6, 7, 8, 12, 20, 24 29, 37, 38, 40, 45 డివిజన్ల పరిధిలో టీడీపీ అభ్యర్థులు వివిధ కారణాలతో తప్పుకున్నారు. తాజాగా 28వ డివిజన్ అభ్యర్థి సైతం పార్టీకి గుడ్‌బై చెప్పారు. మరో రెండు రోజుల్లో వీరి బాటలోనే మరికొందరు బహిరంగంగానే తప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు నామమాత్రంగానే ప్రచారం చేస్తుండడం ఆ పార్టీ దీన స్థితికి అద్దం పడుతోంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సిటీ, రూరల్ టీడీపీ ఇన్‌చార్జిలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇరువురు పొలిటికల్ షో చేయడానికే పరిమితమయ్యారని క్షేత్రస్థాయిలో టీడీపీ అభ్యర్థులు వాపోతున్న వైనం తేటతెల్లమవుతోంది. టీడీపీపై ఉన్న అభిమానంతో బరిలోకి దిగామని, స్థానిక నాయకులు సహకరించడం లేదని బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయిన వారికి సైతం అండగా లేకపోవడంతో బరి నుంచి అర్ధాంతరంగా వైదొలుగుతున్నారు. మరో వైపు వైఎస్సార్‌సీపీకి అపార ప్రజామద్దతు దక్కుతున్న నేపథ్యంలో మరికొంత మంది టీడీపీ అభ్యర్థులు ఇదే బాటలో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు
కార్పొరేషన్ ఎన్నికల్లో 28వ డివిజన్ టీడీపీ అభ్యర్థి మద్దినేని ధనలక్ష్మి పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టించింది. అధినేత చంద్రబాబుతో అభ్యర్థి ధనలక్ష్మి భర్త శాంతినాయుడుకు సన్నిహిత సంబంధాలు ఉండడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు బంధువులు కూడా. అయితే వీరు పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం మీడియా ముఖంగా చెప్పడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నెల్లూరులో తిష్టవేసినా నష్ట నివారణను అదుపు చేయలేని దుస్థితిలో ఉండిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ ఇద్దరి పోకడలతోనే...
నామినేషన్ల గడువుకు మూడు రోజుల ముందు తమపై ఒత్తిడి తెచ్చి ఆర్థిక సహకారం అందిస్తామని నామినేషన్లు వేయించారని చెబుతున్నారు. అన్ని డివిజన్లలో పోటీ చేయించామని చెప్పుకునేందుకు చూపించిన ఆరాటం అభ్యర్థులకు అండగా నిలవడంలో ఆ ఇద్దరు నేతలు ముఖం చాటేశారని, స్థానికంగా నాయకుల సహకారం లేకపోగా, అర్ధరాత్రి వేళల్లో ఇంటి వద్దకు వచ్చి పార్టీలో ఉన్నారా.. ఫిరాయించారా అనే ధోరణిలో వాకబు చేయడాన్ని వీరు అవమానంగా భావించారు. ఆత్మాభిమానం దెబ్బతినిందని, ఆర్థికంగా చితికిపోయిన నేపథ్యంలో ఆదుకోలేదన్న విషయాన్ని బహిర్గతం చేస్తూ, పోటీ నుంచి విరమిస్తూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విషయాన్ని 28వ డివిజన్ టీడీపీ అభ్యర్థి మద్దినేని ధనలక్ష్మి దంపతులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment