
దహనకాండను ప్రేరేపించింది మీరు కాదా?
సీఎం చంద్రబాబుపై ముద్రగడ ధ్వజం
జగ్గంపేట/ప్రత్తిపాడు: ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ధ్వజమెత్తారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘1984లో ఎన్టీఆర్ పదవి పోయినప్పుడు రామకృష్ణా థియేటర్‌లో కూర్చొని ఫోన్ల ద్వారా విధ్వంసం చేసేందుకు పిలుపునిచ్చారు. అలాగే పరిటాల రవి హత్య రోజున అన్ని జిల్లాల్లోనూ పార్టీ సమావేశాలు పెట్టి తగలబెట్టండని దహనకాండను ప్రేరేపించింది మీరు కాదా?’ అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం పుష్కరాలకు రాష్ట్రంలోని పోలీసులను తరలించి గదిలో పెట్టి సొంత ఇమేజ్ కోసం 29 మందిని పొట్టన పెట్టుకున్న బాబూ.. దీనిపై ఎందుకు కేసులు లేవు.. ఎవరిని అరెస్టు చేశారు? అని ప్రశ్నించారు. కాపు కులాలైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను విభజించి తమ జాతిని దగా చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు.
9 నుంచి దీక్షకు ఉపక్రమిస్తా..
తుని సంఘటనలో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు అరెస్టులు ప్రారంభించడంతో ముద్రగడ ఘాటుగా స్పందించారు. బుధవారం సాయంత్రం లోగా కేసులు ఉపసంహరించుకోకపోతే ఈనెల 9 నుంచి దీక్షకు ఉపక్రమిస్తానని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. తుని సమావేశానికి వచ్చిన వారిని అరాచక శక్తులుగా చూపించి కేసులు పెట్టారన్నారు.
తూర్పుగోదావరిలో ఉద్రిక్తత..
కనీస సమాచారం ఇవ్వకుండా తన ముఖ్య అనుచరులతో కలిసి మంగళవారం ఉదయం అమలాపురం చేరుకున్న ముద్రగడ పద్మనాభం.. తనను స్వచ్ఛందంగా అరెస్టు చేయాలని టౌన్ స్టేషన్‌కు వెళ్లారు. ఎవరూ ఊహించని ఈ పరిణామంతో తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమలాపురంలో మొదలైన ఆందోళన.. సాయంత్రం కిర్లంపూడిలో ముద్రగడ దీక్షకు దిగుతానని డిమాండ్ వరకూ కొనసాగింది. తనను అరెస్టు చేయాలని ముద్రగడ పట్టుబట్టడం.. ఇది తమ పరిధిలోని విషయం కాదని పోలీసులు ముద్రగడను బస్సులో అటూఇటూ తిప్పుతూ కిర్లంపూడి తరలించడం వంటి ఘటనతో హైడ్రామా నడించింది.