విషమించిన ముద్రగడ ఆరోగ్యం
- పూర్తిగా విషమించిన ముద్రగడ ఆరోగ్యం
- నాలుగో రోజుకు ఆమరణ దీక్ష
- వైద్య పరీక్షలు, చికిత్సకు నిరాకరిస్తున్న పద్మనాభం
- నేడు ‘చలో రాజమహేంద్రవరం’ పిలుపునిచ్చిన కాపునాడు
సాక్షిప్రతినిధి, కాకినాడ: కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష ఆదివారం నాలుగో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందన్న సమాచారంతో కాపు వర్గీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కాపుల పోరు రోజురోజుకూ ఉధృతమవుతోంది. మహిళలు, విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సోమవారం ‘చలో రాజమహేంద్రవరం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాపు నాడు ప్రకటించింది.
ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు
ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేతలు, యువకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ఖాళీ కంచాలతో నిరసన ప్రదర్శనలు చేశారు. కాగా సాక్షి సహా పలు టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేయడాన్ని సోషల్ మీడియాలో పలువురు ఎండగడుతున్నారు.
ముద్రగడ ఆరోగ్యంపై బులెటిన్
ఆమరణ దీక్ష చేపట్టి నాలుగు రోజులైనా వైద్య పరీక్షలకు, వైద్యానికి ముద్రగడ నిరాకరిస్తుండటంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించిందని ఆదివారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రకటించారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తేనే గాని ముద్రగడ ఆరోగ్యం ఎంతవరకు క్షీణించిందనేది చెప్పలేమని రాజమహేంద్రవరం వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిశోర్ చెప్పారు. ముద్రగడ సతీమణి, కోడలికి బలంవంతంగా ఫ్లూరుుడ్స్ పెట్టగా, చిన్న కుమారుడు గిరి ఆమరణ దీక్షలోనే ఉన్నారు.
టీడీపీకి కాపుల రాజీనామాలు
ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్న సీఎం చంద్రబాబుకు తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీలో ఉన్న కాపులు గట్టి షాక్ ఇచ్చారు. ప లు గ్రామాల్లో టీడీపీకి కాపు నేతలు రాజీనా మా చేశారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ ము ద్రగడను కలిసేందుకు రాజమహేంద్రవరం రాగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి తిప్పి పంపేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌లను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఆందోళనతో అభిమాని మృతి
కొత్తపల్లి: ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తోందనే విషయం తెలుసుకున్న మేడిశెట్టి నూకరాజు అనే అభిమాని ఆదివారం రాత్రి మృతిచెందాడు.
గుండెపోటుతో ముద్రగడ బంధువు కూడా...
కిర్లంపూడి: ముద్రగడ పద్మనాభం దీక్షకు సంబంధించిన దృశ్యాలను టీవీలో వీక్షించిన ఆయన సమీప బంధువు, కిర్లంపూడి రిటైర్డ్ వీఆర్‌ఓ తూము మానీయలు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై మరణించారు.
మా నాన్న ఉగ్రవాదా?
ముద్రగడ పద్మనాభం పెద్ద కుమారుడు బాలు ఆవేదన
సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘ప్రభుత్వం మా నాన్నను ఉగ్రవాదిలా చూస్తోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని దీక్ష చేస్తుండగా వందలాది మంది పోలీసులు ఇంట్లోకి చొరబడి బలవంతంగా ఎత్తుకెళ్లారు. అమ్మ వెన్నెముక సమస్యతో బాధపడుతున్నా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనంలో పడేశారు. తమ్ముడిని దుస్తులు చించివేసి కొట్టారు. అయినా మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా దీక్ష కొనసాగుతుంది’’అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పెద్ద కుమారుడు బాలు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి ఎదుట విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి ప్రాణానికి ముప్పు పొంచి ఉందని ఆందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తమను కొట్టడం అన్ని టీవీ చానళ్లలో ప్రసారమైందని, అయినా అలా జరగలేదని హోంమంత్రి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.