కాపు జేఏసీతో చర్చలు విఫలం
- డిమాండ్లు అంగీకరిస్తేనే దీక్ష విరమణ అన్న ముద్రగడ
- కొనసాగుతున్న దీక్ష, విషమిస్తున్న కాపునేత ఆరోగ్యం
- ముద్రగడ భార్య, కోడలికి వైద్యం
సాక్షి ప్రతినిధి కాకినాడ: తన డిమాండ్లు అంగీకరిస్తేగానీ నిరాహార దీక్ష విరమించేదిలేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ముద్రగడ తరుఫున కాపు జేఏసీ, ప్రభుత్వం మధ్య మంగళవారం రాత్రి పొద్దుపోయాక జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తుని ఘటనలో అరెస్టయినవారి విడుదల, ఇకపై అరెస్టుల నిలుపుదల డిమాండ్లు అంగీకరించే వరకూ దీక్ష విరమించబోనని ముద్రగడ తేల్చి చెప్పారు. డిమాండ్లపై జేఏసీ నేతలు రెండో దఫా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో చర్చించారు. ప్రభుత్వం తరుఫున ఈ చర్చలకు తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ హాజరయ్యారు. అయినా చర్చలు కొలిక్కిరాలేదు. తుని ఘటనలో నమోదైన కేసుల పునర్విచారణ, అరెస్టుల నిలుపుదల అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని జేఏసీ నేతలకు జాయింట్ కలెక్టర్ వివరించారు. దీంతో చర్చలు బుధవారం నాటికి వాయిదా పడ్డాయి.
వైద్యం పేరుతో చర్చలకు సర్కార్...
ముద్రగడ, కుటుంబ సభ్యులు ఆమరణ దీక్ష చేస్తున్న రాజమంహేద్రవరం జిల్లా ఆస్పత్రికి మంగళవారం మధ్యాహ్నం డీఐజీ రామకృష్ణ, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ రవిప్రకాశ్ వచ్చి వైద్యం చేయించుకోవాలని వారికి సూచించారు. బాగా నీరసించిన ముద్రగడ భార్య పద్మావతి, కోడలు సిరిలకు బలవంతంగా వైద్యం ప్రారంభించారు. ముద్రగడ మాత్రం వైద్యానికి నిరాకరించారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.
ముఖ్య నేతలతో సీఎం మంతనాలు
సాక్షి, విజయవాడ బ్యూరో: ముద్రగడ దీక్ష విషయంలో ఏం చేయాలనేదానిపై మూడురోజుల నుంచి తీవ్ర తర్జనభర్జనలు పడుతున్నారు. పార్టీకి చెందిన కాపు మంత్రులు, ముఖ్య నేతలతో విజయవాడలోని తన నివాసంలో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
ముద్రగడపై ఆత్మహత్యాయత్నం కేసు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): ముద్రగడ, ఆయన భార్య పద్మావతి, కుమారుడు, కోడలిపై మంగళవారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాకినాడ జీజీహెచ్‌కు చెందిన డాక్టర్ సౌభాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైకోర్టులో పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: ముద్రగడను హైదరాబాద్‌లో అన్ని వసతులున్న నిమ్స్‌కు గానీ, ఏదైనా సూపర్ స్పెషాలటీ ఆసుపత్రికి గానీ తరలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని అఖిల భారత తెలగ, కాపు, బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి అద్దేపల్లి శ్రీధర్ లక్ష్మణ్ దాఖలు చేశారు.