ముద్రగడ దీక్ష విరమణలో ప్రతిష్టంభన
- తుని ఘటనలో అరెస్ట్ చేసిన 13 మంది విడుదలలో జాప్యం
- సెంట్రల్ జైలు నుంచి ఎనిమిది మంది విడుదల
- అందరూ విడుదలైతేనే దీక్ష విరమణ అంటున్న ముద్రగడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష విరమణపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఆయన ఆరోగ్యం అపాయకర పరిస్థితికి చేరినప్పటికీ దీక్ష విరమింపజేసే విషయంలో సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కాపు ఐక్యగర్జన సందర్భంగా తునిలో చోటుచేసుకున్న ఘటనలో అరెస్టు చేసిన 13 మందిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ముద్రగడ, చేపట్టిన ఆమరణ దీక్ష శనివారానికి పదవరోజుకు చేరుకుంది.
మాటతప్పిన ప్రభుత్వం...: ప్రభుత్వం ఇచ్చినమాట ప్రకారం శనివారం 13 మంది విడుద లవుతారు.. ముద్రగడ దీక్ష విరమిస్తారని భావించారు. కానీ బెయిల్ మంజూరైన పదిమందిలో 8మందే విడుదలయ్యారు. బెయిల్ పత్రాలు సమర్పించకపోవడంతో కూరాకుల పుల్లయ్యను విడుదల చేయలేదు. మరోవైపు కోటనందూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు లగుడు శ్రీనుకు బెయిల్ లభించినా సీఐడీ పోలీసులు తమ కస్టడీకి తీసుకోవడం గమనార్హం. మొత్తం 13 మంది విడుదలకు అన్నిచర్యలూ తీసుకుంటామని ఇచ్చినమాటను సర్కారు తప్పింది.
ఆహారం తీసుకోకుంటే ప్రమాదమే
ముద్రగడ బలవంతంమీద ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారు.ఆయన ఆరోగ్యం కుదుటపడినట్టు కాదని, ఆహారం తీసుకోకుంటే ప్రమాదమని అంటున్నారు. ముద్రగడ భార్య పద్మావతి కడుపునొప్పితో బాధపడుతున్నారు. పరీక్షలు చేస్తే ఇన్‌ఫెక్షన్ ఉందని తేలింది.
బలప్రయోగం.. నిరసనలు
ఒకపక్క ముద్రగడ దీక్ష విరమణను కొలిక్కితెస్తున్నట్టు ప్రభుత్వం చెబుతూనే మరోపక్క కాపు ఉద్యమాన్ని పోలీసు బలప్రయోగంతో అణచివేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం నుంచి ర్యాలీ నిర్వహిస్తున్న కాపు యువకులపై పోలీసులు లాఠీచార్జి చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించేశారు.
ముద్రగడ కుమారుడు, కోడలు దీక్ష విరమణ
కంబాలచెరువు: ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి, కోడలు సిరి ఆరోగ్యం విషమంగా ఉండడంతో శనివారం రాత్రి 11 గంటలకు దీక్ష విరమించారు. వారిని సొంత వాహనాల్లో వైద్య చికిత్సకోసం విశాఖపట్నం తీసుకెళ్లారు.