కొనసాగుతున్న ముద్రగడ దీక్ష
- వైద్యానికి నిరాకరణ
- పలు దఫాలుగా అధికారుల చర్చలు.. విఫలం
సాక్షి, రాజమహేంద్రవరం: కాపు గర్జన సందర్భంగా తుని ఘటనలో నమోదైన కేసులను ఎత్తివేయాలని, అరెస్టు చేసిన అమాయకులను విడుదల చేయాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలోనూ సతీమణి పద్మావతితో కలసి ఆయన మంచి నీరు కూడా తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించి వైద్యం పొందడానికి సహకరించాలని పలు దఫాలుగా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
తమ డిమాండ్లు నెరవేర్చే దాకా దీక్ష విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు. ఒకానొక దశలో అధికారులు బలవంతంగా ఆయనకు ప్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేసినా ప్రతిఘటించారు. తన వద్దకు వస్తే ఆత్మహత్య చేసుకుంటానని, తలను గోడకేసి కొట్టుకుంటానని హెచ్చరించారు. ఆ మాటలు వినకుండా దగ్గరకు వస్తుండగా పక్కనే ఉన్న గోడకు తల కొట్టుకోవడంతో తలకు స్పల్ప గాయమైంది. మరోవైపు ముద్రగడ ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ వహించడంలేదన్న ఆరోపణలున్నాయి. హెల్త్ బులెటిన్లేవీ అధికారికంగా విడుదల చేయకపోవడంతో ముద్రగడ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేడు రాష్ట్ర బంద్‌కు కాపునాడు పిలుపు
సాక్షి, హైదరాబాద్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను అమానుషంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం రాష్ట్ర బంద్‌కు ఏపీ కాపునాడు పిలుపునిచ్చింది.