
నేటి నుంచి ముద్రగడ దీక్ష
- ఒక్కడినే దీక్ష చేస్తా: ముద్రగడ
- రాయబారానికి ఎవరూ రావద్దని విజ్ఞప్తి
సాక్షిప్రతినిధి, కాకినాడ: కాపులను బీసీ జాబితాలో చేర్చాలని, తుని ఘటన నేపథ్యంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ముద్రగడ ఆమరణ దీక్షను బుధవారం రాత్రి ప్రకటించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రిజర్వేషన్లకు ఇచ్చిన గడువు ఆగస్టు సమీపిస్తుండటంతో వేగంపెంచాలని, కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ముద్రగడ బుధవారం వరకు ప్రభుత్వానికి గడువు విధించిన విషయం తెలిసిందే. ఇచ్చిన గడువు పూర్తరుునా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కనిపించకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపు నేతలతో పలు దఫాలుగా చర్చించిన అనంతరం ఆమరణ దీక్షను ప్రకటించారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించనున్న దీక్షకు కిర్లంపూడిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు అప్రమత్తమైన ప్రభుత్వం జిల్లా సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సుమారు ఐదువేల మంది పోలీసులను రంగంలోకి దింపారు.
కేసులు ఎత్తేసే వరకు దీక్ష: ముద్రగడ
తుని సంఘటన నేపథ్యంలో కేసులను ఎత్తివేసేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. తాను ఒక్కడినే దీక్ష ప్రారంభిస్తానని, రాయబారానికి ఎవరూ రావద్దని కోరారు. కిర్లంపూడిలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కాపు జాతిని చీల్చేందుకు కుట్ర పన్నుతోందని, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను నాలుగు గ్రూపులుగా విడదీయాలనే కుట్రతో తనను ఒంటరిని చేసేయ్యాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. తుని సభను దహనకాండ చేసేందుకు కూడా చంద్రబాబు కుట్ర పన్నారని, వేదికను, పార్కింగ్‌లో ఉన్న కార్లను దహనం చేసేందుకు పెట్రోలు ప్యాకెట్లతో పంపించారన్నారు. ఇటువంటి కుట్రలు చంద్రబాబుకే చేతనవుతాయన్నారు.
ఏ-1గా ముద్రగడ
కాగా, ముద్రగడపై నమోదైన కేసులకు సంబంధించి హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులు బుధవారం సమీక్షించారు. కాకినాడలో హోంమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు భేటీ అనంతరం డీఐజీ, ఇతర పోలీసు అధికారులతో చినరాజప్ప చర్చించినట్టు సమాచారం. తునిలో జనవరి 31న కాపు ఐక్యగర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ముద్రగడను ఏ-1గా చేరుస్తూ 76 కేసులు నమోదు చేసినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. రత్నాచల్ దహనం, పోలీసు స్టేషన్‌పై దాడి, పోలీసులపై దాడితోపాటు సెల్‌ఫోన్‌లు చోరీ కేసులో కూడా నిందితుడుగా చేర్చినట్టు తెలిసింది. అరెస్టు చేస్తే ఎదురయ్యే పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.