ముంచుకొచ్చిన మృత్యువు
ముంచుకొచ్చిన మృత్యువు
Published Fri, Sep 23 2016 1:49 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
తాళ్లపూడి: అకాల మృత్యువు ముంచుకొచ్చిం ది. గుర్తుతెలియని వాహనం రూపంలో కాటేసింది. తాళ్లపూడి మండలం గజ్జరం సంగం చెరువు మలుపులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరిగేటి గోపినాథ్ (29), రామ స్వరూప్ (30) అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి పాటి శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, తాళ్లపూడి ఎస్సై జె.సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. గోపినాథ్, రామస్వరూప్, శ్రీను చింతలపూడి ఎత్తిపోతల పథకంలో మెషీన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. వీరు ముగ్గురు అన్నదేవరపేటలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడి నుంచి గోపవరం వద్ద జరుగుతున్న చింతలపూడి కాలువ పనులకు వెళుతున్నారు. వీరిలో గోపినాథ్‌ది కొయ్యలగూడెం దగ్గర అంకాలగూడెం కాగా రామస్వరూప్ జార్ఖండ్‌కు చెందిన వాడు. పాటి శ్రీనుది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. గురువారం వేకువజామున వీరు ముగ్గురు మోటార్ సైకిల్‌పై అన్నదేవరపేట నుంచి తాళ్లపూడి వెళుతున్నారు. గజ్జరం నుంచి పైడిమెట్ట వచ్చే సంగం చెరువు రోడ్డు మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో గోపినాథ్, రామస్వరూప్ అక్కడికక్కడే మృతిచెందగా పాటి శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. మోటార్ సైకిల్ పూర్తిగా ధ్వంసమై సమీపంలోకి తుప్పల్లో పడి ఉంది. మృతదేహాలు తుప్పల్లో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు క్షతగ్రాత్రుడు శ్రీనును 108లో కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్లారు. వీరిని ఏదైనా వాహనం ఢీకొట్టి ఉంటుందని, ప్రమాదం జరిగిన తర్వాత మృతదేహాలను తుప్పల్లోకి లాగి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రాజెక్టులో పనిచేసే తోటి పనివారు సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. గోపినాథ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మిగిలిన వారి కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్సై సతీష్ ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
Advertisement
Advertisement