
ప్రేమను కాదన్నందుకు లారీ కిందకు..
యువతిని తోసేసిన ప్రేమోన్మాది
♦ డ్రైవర్ చాకచక్యంతో యువతికి తప్పిన ప్రాణాపాయం
♦ బంపర్ ఢీకొనడంతో ముఖం, తలకి గాయాలు
♦ పరారైన నిందితుడు
♦ ఖమ్మం జిల్లా ఇల్లెందులో దారుణం
ఇల్లెందు: ప్రేమను నిరాకరించినందుకు ఓ ఉన్మాది వేగంగా వస్తున్న లారీ కిందకు యువతిని తోసేశాడు! లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పినా.. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా మంగపేట మండలం బ్రహ్మణపల్లికి చెందిన గిరిజన విద్యార్థి బడె సంధ్య ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీజెడ్‌సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
స్థానిక హాస్టల్‌లో ఉంటోంది. జూలూరుపాడు మండలం సుజాతనగర్ సమీపంలోని సత్యనారాయణపురానికి చెందిన శేఖర్ అనే యువకుడు సంధ్యను కొంతకాలంగా ప్రేమించమని వేధిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం కోసం కాలేజీ నుంచి హాస్టల్‌కు వెళ్తున్న సంధ్యను శేఖర్ అడ్డుకున్నాడు. ప్రేమించాలని అడగడంతో సంధ్య నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన శేఖర్.. సంధ్య మెడ, చేతులను గట్టిగా అదిమి పట్టి ఎదురుగా ఐరన్‌లోడ్‌తో వెళ్తున్న లారీ ముందుకు నెట్టివేశాడు. వీరిద్దరినీ దూరం నుంచే గమనిస్తున్న డ్రైవర్ అప్రమత్తమై లారీని పక్కకు తప్పించాడు.
ప్రాణాపాయం తప్పినా.. సంధ్యను లారీ బంపర్ ఢీకొనడంతో ముఖం, తల, ఛాతీ భాగాలపై బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోరుుంది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఆదివాసీ విద్యార్థి సంఘం నేత ఈసాల సురేశ్ ఓ ఆటోను నిలిపి సంధ్యను ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లమంటూ డ్రైవర్‌ను పురామాయించాడు. అయితే ఆటో డ్రైవర్ నిరాకరించాడు. శేఖర్‌ను పట్టుకునేందుకు సురేశ్ ప్రయత్నించగా సమీపంలోని కొరగుట్ట అటవీ ప్రాంతంలోకి పారిపోయూడు. ఘటన విషయాన్ని సురేశ్ మీడియాకు చేర్చాడు. కాసేపటికే ఇల్లెందు ఎమ్మెల్యే కనకయ్య, పోలీసులు అక్కడికి చేరుకొని గాయాలతో రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న సంధ్యను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి పంపించారు. నిందితుడు శేఖర్ నర్సరీలో పనిచేస్తాడని తెలిసింది.
విద్యార్థి సంఘాల నిరసన ప్రదర్శన
ఈ ఘటనను నిరసిస్తూ ఏవీఎస్పీ, పీడీఎస్‌యూ, ఏఎస్పీ, టీఎన్‌ఎస్‌ఎఫ్, తుడుందెబ్బ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ఇల్లెందులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థినిపై హత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచాలన్నారు.