కారుతో ఢీకొట్టి.. కత్తులతో వెంటపడి!
ఆత్మకూరు: కర్నూలు జిల్లా ఆత్మకూరులోని కే-స్టార్ గోడౌన్ యజమాని అన్వర్ తన అనుచరులతో కలిసి లాయర్ అజ్మతుల్లాపై, శివరామి రెడ్డి అనే రైతుపై హత్యాయత్నం చేశాడు. ప్లాన్ ప్రకారం మొదట కారుతో ఢీకొట్టి, ఆపై నిందితులు కత్తులతో వారిద్దరిని నరికి హత్యచేయాలని ప్రయత్నించారు. గోడౌన్ యజమాని, అతడి అనుచరుల దాడిలో అజ్మతుల్లాతో పాటు రైతు శివరామిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివరామిరెడ్డి పండించిన ధాన్యంతోపాటు వ్యాపార రీత్య కొనుగోలు చేసిన ధాన్యాన్ని శివరామిరెడ్డి ఆత్మకూరు శివారులోని కే -స్టార్ గోదాములో నిల్వ ఉంచేవాడు. అలా నాలుగేళ్ల కిందట గోదాములో ఉంచిన సుమారు కోటి రూపాయల విలువైన ధాన్యాన్ని విక్రయించేందుకు ఆయన 2015లో గోదాముకు వెళ్లగా యజమాని ఎన్‌ఎస్ అన్వర్ ధాన్యం లేదంటూ ప్లేట్ ఫిరాయించాడు. అప్పటి నుంచి ఆయన కేస్టార్ గోదాము యాజమానయంపై న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అన్వర్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడి ఇద్దరిని హత్య చేయాలని యత్నించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి ఓ ఎస్‌ఐ కూడా సస్పెన్షన్‌కు గురైనట్టు సమాచారం.