
మృతిచెందిన అపర్ణ
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం
విచారణ చేపట్టిన డీఎస్పీ వీరేశ్వర్‌రావు
పోలీసుల అదుపులో అత్త, మామ
ఇల్లెందు అర్బన్ : అదనపు కట్నం కోసం కోడలిని హింసించి.. గొంతునులిమి హత్య చేసిన సంఘటన ఇల్లందులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై రామారావు కథనం ప్రకారం.. పట్టణంలోని ఎన్‌జీఓస్ కాలనీకి చెందిన మాదంశెట్టి రామయ్య, తిరుపతమ్మ కుమారుడు శ్రీనివాస్‌కు.. ఖమ్మంలోని చెరువుబజార్‌కు చెందిన అపర్ణ(21)తో గత ఏడాది వివాహం జరిగింది. కొన్ని నెలల తర్వాత అపర్ణంను అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్త, మామ, భర్త వేధించసాగారు. దీంతో ఆమె మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. కుల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి.. అపర్ణను ఇబ్బందులకు గురిచేయమంటూ వారం రోజుల క్రితం అత్త, మామ ఆమెను ఇల్లెందుకు తీసుకొచ్చారు. వచ్చిన రెండో రోజు నుంచి యాథావిధిగా వరకట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను అత్త, మామ, భర్త మూకుమ్మడిగా గాయపరిచి.. హతమార్చారు. స్థానికులకు అనుమానం రాకుండా అపర్ణ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందంటూ చిత్రీకరించేందుకు యత్నించారు. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యుడు మృతిచెందిందని ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని అత్తగారింటికి తీసుకొచ్చారు. తర్వాత మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీనిపై సమాచారం అందుకున్న డీఎస్పీ వీరేశ్వర్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని.. మృతురాలి మామను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భర్త శ్రీనివాస్ పరారీలో ఉండటంతో అనుమానం వచ్చిన డీఎస్పీ సమగ్ర విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించగా.. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో.. తీవ్రంగా గాయపరిచి.. గొంతు నులమడంతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అత్త, మామపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా, అపర్ణ మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది