పండుగ రోజు దారుణం | murder in madigubba | Sakshi
Sakshi News home page

పండుగ రోజు దారుణం

Published Wed, Sep 7 2016 12:18 AM | Last Updated on Mon, Oct 8 2018 3:48 PM

murder in madigubba

అందరూ వినాయక చవితి పండుగ సంబరాల్లో మునిగి ఉన్నారు. అంతలోనే ఓ దారుణం వెలుగు చూసింది. ఓ వివాహిత మహిళ కిరాతకంగా హత్యకు గురవడం కలకలం రేపింది. వివాహేతర సంబంధం పెట్టుకునే వ్యక్తే ఆమెను చంపి ఉంటాడని ఊరు ఊరంతా కోడైకూసింది. తన అవసరాలకు డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలతెలవారుతుండగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.  

ఆత్మకూరు : ఆత్మకూరు మండలం మదిగుబ్బ ఎస్సీ కాలనీకి చెందిన పెద్దన్న అలియాస్‌ సన్నప్పయ్య భార్య ఎనుముల లక్ష్మిదేవి(35) సోమవారం తెల్లవారుజామున దారణ హత్యకు గురైంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం... లక్ష్మిదేవి, సన్నప్పయ్యకు వివాహమై పదిహేనేళ్లవుతోంది. అయితే వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేదు.

జుట్టు పట్టుకుని ఈడ్చుకువచ్చి..
ఈ నేపథ్యంలో లక్ష్మిదేవి అదే గ్రామానికి చెందిన ఎర్రిస్వామితో సన్నిహితంగా ఉంటోంది. భర్త తన సంపాదనను తెచ్చి భార్యకిస్తే, ఆమె ప్రియుడికి ఇచ్చేది. ఈ నేపథ్యంలోనే ఎర్రిస్వామి తనకు డబ్బు అవసరముందని, తెచ్చివ్వాలని లక్ష్మిదేవిని ఆదివారం డిమాండ్‌ చేశాడు. ప్రస్తుతానికి తన వద్ద డబ్బు లేదని ఆమె బదులిచ్చింది. దీంతో అతనిలో ఆవేశం కట్టలు తెచ్చుకుంది. అందరూ చూస్తుండగానే ఆమె జుట్టు పట్టుకుని న డి వీధిలోకి ఈడ్చుకువచ్చాడు. అందరూ చూస్తుండగానే కసితీరా కొట్టాడు. ఆ తరువాత సోమవారం తెల్లవారుజామునకల్లా ఆమె మృతదేహమై పడి ఉంది.

భర్త ఫిర్యాదుతో...
భార్య మృతదేహాన్ని చూసిన పెద్దన్న నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు గ్రామానికి చేరుకుని లక్ష్మిదేవి మృతదేహాన్ని పరిశీలించారు. ఇంట్లోని చెక్కతో బలంగా కొట్టడంతోనే ఆమె మరణించినట్లు గుర్తించారు. హతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసుల అదుపులో నిందితుడు?
లక్ష్మిదేవి హత్యకు సంబంధించి అనుమానితుడైన ఆమె ప్రియుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తమదైన శైలిలో అతన్ని విచారించినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement