అంతుచిక్కని ప్రశ్నలెన్నో..! | murder mystory | Sakshi
Sakshi News home page

అంతుచిక్కని ప్రశ్నలెన్నో..!

Published Fri, Jan 27 2017 11:27 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

అంతుచిక్కని ప్రశ్నలెన్నో..! - Sakshi

అంతుచిక్కని ప్రశ్నలెన్నో..!

శ్రీగౌతమి మృతి కేసు దర్యాప్తులో అన్నీ అనుమానాలే
 స్టేట్‌మెంట్‌ కాపీపై సంతకం తనది కాదంటున్న పావని
 హత్యకేసుగా నమోదు చేయాలని పెరుగుతున్న డిమాండ్‌
 నిర్భయ చట్టం దేవుడెరుగు.. కనీసం ఈవ్‌టీజింగ్‌ కేసైనా పెట్టని పోలీసులు
 
నరసాపురం :
నరసాపురం పట్టణానికి చెందిన దంగేటి శ్రీగౌతమి మృతి కేసుకు మసిపూసి మారేడుకాయ చేశారాఽ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత సజ్జా బుజ్జి కుటుంబానికి పూర్తిగా కొమ్ము కాసేందుకే కట్టుబడి ఉన్నారా.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని వారం రోజులుగా చెబుతూ వచ్చిన పోలీసులు రాష్ట్రస్థాయి నేతల వత్తిళ్లకు పూర్తిగా దోసోహమన్నారా.. అనే అనుమానాలకు అవుననే అనిపిస్తోంది. శ్రీగౌతమి మృతి కేసును ప్రమాదవశాత్తు జరిగిందేనని పోలీసులు ఇప్పటికే తేల్చేశారు. విశాఖకు చెందిన ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. శ్రీగౌతమి మృతి చెందిందని తెలిసిన రోజునుంచి ఇది ముమ్మాటికీ హత్యేనని.. ప్రమాదంలో గాయపడి ప్రాణాలతో బయటపడ్డ పావని చెబుతూ వస్తోంది. తన అక్కకు టీడీపీ నేత బుజ్జితో వివాహం జరిగిందని, అతని మొదటి భార్య తన అక్కను బెదిరిస్తోందని ఆరోపిస్తోంది. పోలీసులు ఇవేమీ పట్టించుకోలేదు. అక్క చనిపోయిందని తెలియక ముందునుంచీ మొదటి మూడు రోజులపాటు పావని తమను కారులో కొందరు వెంబడించారని, కారులోంచి తన చున్నీ పట్టుకుని లాగే ప్రయత్నం చేశారని చెబుతోంది. శ్రీగౌతమిని సజ్జా బుజ్జి రహస్య వివాహం చేసుకోవడం వంటి విషయాలు పక్కన పెడితే.. కనీసం ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినట్టు తేలినా దీనిపై పోలీసులు శ్రద్ధ పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిజానికి శ్రీగౌతమి కేసును నిర్భయ చట్టం కింద నమోదు చేయాలని పౌర హక్కులు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆ చట్టం కింద కేసు నమోదు చేయడం దేవుడెరుగు.. కనీసం ఈవ్‌టీజింగ్‌ సెక‌్షన్లు అయినా నమోదు చేయకపోవడం వెనుక కారణాలేమిటనేది అంతుబట్టడం లేదు. పోలీసులు కేవలం రెండు సెక‌్షన్లతో కేసు నమోదు చేసి ఊరుకున్నారు. 
దొరికిన నిందితులపైనా కనికరం ఎందుకు
విశాఖకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఘటనకు కారకులుగా నిర్ధారించారు. ప్రమాదంలో శ్రీగౌతమి మృతికి కారణమైనందుకు 304 (ఎ), ఘటనలో పావని గాయాల పాలైనందుకు 338 ఽసెక‌్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు కారులో తమను కొంతదూరం పాటు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారని పావని ఆరోపిస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పానంటోంది. మరికొన్ని సెక‌్షన్ల కిందఽ నిందితులపై కేసులు పెట్టే అవకాశం ఉన్నా పోలీసులు ఎందుకు ముందడుగు వేయలేదనేది మరో ప్రశ్న. ఎంత చెప్పినా సజ్జా బుజ్జి, అతని భార్యపై పేరును కేసులో ప్రస్తావించడం లేదని పావని వాపోతోంది. ఘటన జరిగిన రెండో రోజునే, ఇది ప్రమాదమని, ఇద్దరు నిందితులు అదుపులో ఉన్నారని పాలకొల్లు పోలీసులు చెప్పారు. 8 రోజుల దర్యాప్తు తరువాత కూడా వారినే చూపించారు. మరి నిందితుల వివరాలు తెలపడానికి ఇంత సమయం తీసుకుని పోలీసులు ఏంచేశారనేది ఇంకో ప్రశ్న
స్టేట్‌మెంట్‌ కాపీని అనుకూలంగా మార్చుకున్నారా
ప్రమాదం జరిగిన తరువాత పావని నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్‌ కాపీ తారుమారైందనే ఆరోపణలూ వస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్‌కు జతచేసిన స్టేట్‌మెంట్‌ కాపీపై సంతకం తనది కాదని పావని చెబుతోంది. తన సంతకం వేరే విధంగా ఉంటుందని స్పష్టం చేస్తోంది. అలాగే ఐక్య ఎమర్జెన్సీ ఆసుపత్రిలో పోలీసులు తన స్టేట్‌మెంట్‌ తీసుకున్నప్పుడు.. తమను కారులో కొందరు వ్యక్తులు టీజ్‌ చేశారని, కావాలని వెంబడించి ఢీకొట్టారని చెప్పానని తెలిపింది. పోలీసులు తనకు ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌తో కూడిన స్టేట్‌మెంట్‌ కాపీలో ఈ వివరాలేమీ లేవనేది పావని కొత్తగా తెరమీదకు తెస్తున్న వాదన. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేప్పుడు, సంబంధిత వ్యక్తుల బంధువుల సమక్షంలో చేస్తారు. సాక్షులుగా వారి సంతకాలు తీసుకుంటారు. తన వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నప్పుడు, వరుసకు తనకు సోదరుడైన కె.మణికంఠ అనే సంతకం పెట్టాడని పావని చెబుతోంది. పోలీసులు తనకు ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌ ప్రతిలో సాక్షి సంతకం లేదంటోంది. దీనినిబట్టి కావాలనే వేరే స్టేట్‌మెంట్‌ తయారు చేశారా? అనే అనుమానం కలుగుతోంది. ఘటన జరిగిన రోజు కారులో క్రికెట్‌ బ్యాట్‌లు, మందు బాటిళ్లు ఉన్నాయని వార్తలు వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో వీటికి సమాధానం లేదు. వైజాగ్‌ నుంచి మూడురోజుల క్రితమే నిందితులు బయలుదేరారిని చెప్తున్నారు. వారు ఎక్కడెక్కడ తిరిగారు అనే దానిపై కూడా స్పష్టత లేదు. మొత్తం ఘటనలో కీలకంగా ఉన్న సజ్జా బుజ్జి ప్రమాదం జరిగిన తరువాత ఆసుపత్రికి వచ్చాడు. శ్రీగౌతమి మృతి చెందిన తరువాత అదృశ్యమయ్యాడు. ఇలా అనేక సందేహాలు, అనుమానాలు వెంటాడుతున్నాయి. శ్రీగౌతమి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైతం కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిని పూర్తిగా నివృత్తి చేయాలని పోలీసులకు సూచించారు. లేదంటే కేసు ఇంకా బలపడుతుందని, అనుమానాలు పెరుగుతాయని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు.
 
న్యాయ పోరాటం చేస్త
కేసులో న్యాయం జరగటం లేదు. ఆ అక్క హత్యకు గురైంది. నేను చెప్పిన విషయాన్ని కూడా పట్టించుకోలేదు. నన్ను టీజ్‌ చేశారని చెప్పాను. స్టేట్‌మెంట్‌ కాపీపై సంతకం నాది కాదు. మా అన్నయ్య సాక్షి సంతకం పెట్టాడు. నాకు ఇచ్చిన కాపీలో అది లేదు. బుజ్జి, అతని భార్యపై న్యాయ పోరాటం చేస్తాను. కేసును మళ్లీ దర్యాప్తు చేయాలి. హత్యకేసుగా నమోదు చేయాలి. నా పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా అందరినీ వేడుకుంటున్నాను.
 దంగేటి పావని, నరసాపురం
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement