ముస్లిం ఇంట్లో వేద మంత్రాలు.. తలంబ్రాలు
- హిందూ సంప్రదాయంపై మక్కువ చాటుకున్న ముస్లిం
- శుభలేఖ నుంచి విందు వరకూ అన్నీ హైందవం ప్రకారమే
- పెళ్లి కుమారుడి తరపువారిని, బంధువులనూ ఒప్పించి వివాహం
రంపయర్రంపాలెం (గోకవరం): హిందూ మత సంప్రదాయాలపై మక్కువ కలిగిన ఓ ముస్లిం సోదరుడు తన కుమార్తె వివాహాన్ని హైందవ సంప్రదాయంలో జరిపించాడు. అతడి ఇంట్లో 'మాంగల్యం తంతునానేన..' అంటూ వేదమంత్రాలు ప్రతిధ్వనించాయి. పెళ్లి కుమారుడి తరఫు వారిని, బంధువులనూ ఒప్పించి ఈ పెళ్లి జరిపించడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, రంపయర్రంపాలేనికి చెందిన వ్యాపారి, వైఎస్సార్‌సీపీ నేత షేక్ మగ్ధూమ్ (రఫీ)కి చిన్ననాటి నుంచి హిందూ సంప్రదాయాలంటే ఇష్టం ఉండేది. వేదమంత్రాలపై అపార నమ్మకం. ఈ విశ్వాసమే తన కుమార్తె రేష్మీ, వరుడు అబ్దుల్ రహీమ్‌ల వివాహం హిందూ సంప్రదాయంలో నిర్వహించేలా చేసింది.
పెళ్లి సందర్భంగా శుక్రవారం ఉదయం రఫీ ఇంట వేద పండితులు ప్రతి మంత్రానికీ అర్థాన్ని వివరిస్తూ వివాహం జరిపించారు. శుభలేఖనూ హిందూ సంప్రదాయం ప్రకారం జానక్యాః కమలామలాంజలి పుటేయూః పద్మరాగారుతాః..’ అనే శ్లోకం, హిందూ దేవతామూర్తుల బొమ్మలతో ముద్రించినట్లు వారు తెలిపారు. పెళ్లి అనంతరం వధూవరుల తలంబ్రాల ముచ్చట బంధుమిత్రులకు కన్నులపండుగలా అనిపించింది. కాగా తన గ్రామానికి చెందిన పదిమంది హిందూ అవివాహిత యువతులకు రూ.10 వేల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన బాండ్లను పెళ్లి పందిరిలో రఫీ.. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందించారు. హిందూ సంప్రదాయం, వేద మంత్రాలపై తనకు చిన్ననాటి నుంచి నమ్మకం ఉందని, అందుకే పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిపించానని రఫీ ఆనందంగా చెప్పారు.