
బాధితులకు న్యాయం చేయాలి
రాజంపేట: గండికోట ప్రాజెక్టు కింద ముంపుకు గురయ్యే గ్రామాలకు పునరావాసం ప్యాకేజి సరిదిద్ధి బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ముంపుబాధితులకు జరుగుతున్న అన్యాయాలపై నిరసన గళం విప్పారు. గ్రామాల్లోకి నీళ్లు రావడంతోఊర్లు వదలుతున్నా ఇంతవరకూ పరిహారం చెల్లించలేదన్నారు. ప్రాజెక్టు కింద 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయన్నారు. అందులో మొదటగా చౌటుపల్లె, గండ్లూరు, ఓబన్నపేట, కె.బొమ్మెపల్లె గ్రామాల్లో ఇప్పటి నీటి నిల్వ ఉందన్నారు. పండుగ రోజులు వారికి ముంపుకష్టాలు తప్పలేదన్నారు. సతీష్‌రెడ్డి గడ్డం గీయించుకోవడం కోసం ముంపు గ్రామాలను ప్రజలను ముంచేసి, తన పట్టుదల నెరవేర్చేందుకు ప్రయత్నించడమే తప్ప ముంపుబాధితులకు పరిహారం ఇచ్చి ఖాళీ చేయిస్తామనే ఆలోచన ఎక్కడకాలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీష్‌రెడ్డిపై గడ్డం ఉన్న ప్రేమ, ముంపువాసులపై మాత్రంలేకపోవడం శోచనీయమన్నారు. గత దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరెడ్డి హయాంలో గండికోట ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి అయిందని, ఇప్పుడు గేట్లు ఎత్తడం గొప్పగా సీఎం చెప్పుకుంటున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబునాయుడు గండికోట ప్రాజెక్టుకు రెండు సార్లు శిలాఫలకం వేసినా ఏరోజు కూడా గండికోట ప్రాజెక్టు ఆలోచనరాలేదన్నారు.2019లో ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రాజెక్టులు పూర్తి చేయాలనే యోచన జగన్‌మోహన్‌రెడ్డికి ఉందన్నారు. ప్రజలకు మేలుచేసే పాలకులు రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు అభివృద్ధి, సంక్షేమం చూడకుండా ఎంపీటీసీలను బలవంతంగా చేర్చుకోవడం, వారు మళ్లీతిరిగి సొంతగూటికి చేరడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆకేపాటి రంగారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చొప్పా ఎల్లారెడ్డి, కాకతీయ విద్యాసంస్థల అధినేత రమణారెడ్డి పాల్గొన్నారు.