మ్యాక్స్‌కేర్‌కు తరలిన నిండు గర్భిణి
గూడూరు : ప్రాణసంకటంలో హృదయవేదన పడుతున్న నిండు గర్భిణి వాంకుడోతు భారతిని గూడూరు శివారు అయోధ్యపురం పీహెచ్‌సీ వైద్యుడు అంబరీష్, ఆరోగ్య మిత్ర అబ్బు మహేందర్‌రెడ్డి వరంగల్‌లోని మ్యాక్స్‌కేర్ ఆసుపత్రికి తరలించారు. గురువారం ‘హృదయవేదన’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన విషయం తెలిసిందే. కథనాన్ని చదివిన మానుకోట ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ వెంటనే వరంగల్ డీఎంహెచ్‌ఓకు విషయం తెలిపాడు. అతను గూడూరులోని అయోధ్యపురం పీహెచ్‌సీ వైద్యుడు అంబరీష్, ఆరోగ్యమిత్ర మహేందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చాడు. తర్వాత వారు కేశ్రతండాలోని వాంకుడోతు భారతి ఇంటికి చేరుకొని అమెను పరీక్షించారు. ప్రస్తుతానికి నాడీ వ్యవస్థ బాగానే ఉన్నట్లు, గుండె వైద్యుడు పరిశీలించిన రిపోర్టును పరిశీలించారు. అనంతరం ఆరోగ్యమిత్ర ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ సుమంత్‌రెడ్డికి తెలిపాడు. అక్కడ ఆన్‌లైన్‌లో ఆమె కథనం చదివిన ఆయన వరంగల్‌లోని మ్యాక్స్‌కేర్‌కు తరలించమని చెప్పారు. జిల్లా, రాష్ట్ర ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారుల సూచన మేరకు వెంటనే వైద్యుడు అంబరీష్ భారతి భర్త మహేందర్‌కు చెప్పి తరలించారు. కానీ భారతి నిండు గర్భిణి, పైగా గుండెజబ్బు ఉండడంతో ఆరోగ్యశ్రీలో వర్తిస్తుందా లేదా అన్నది కూడా వైద్యాధికారులు మ్యాక్స్‌కేర్ పరీక్షల అనంతరం తెలుస్తుందంటూ అనుమానాస్పదంగా బదులిచ్చారు. దీంతో భారతి పరిస్థితి ఆరోగ్యశ్రీ లో తీరుతుందా..లేక ఆపన్నహస్తం కోసం ఎదురు చూడాల్సి వస్తుందా అన్నది సందిగ్ధంగా ఉంది.