సాక్షి, తిరుపతి: తుపాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం గూడూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఆయన ఏరియల్ సర్వే చేశారు. ఆపై క్షేత్ర స్థాయిలో పర్యటించి వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. బాధితుల కష్టాలు విని చలించిపోయారు. అన్నదాతల కన్నీళ్లు తుడుస్తూ అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
వాకాడు మండలంలోని తొమ్మిది గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా స్వర్ణముఖి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలు తిరిగి వేసుకునేందుకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సీఎం ప్రకటనపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.
వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాళెం పరిధిలో కోతకు గురైన స్వర్ణముఖి నది లోలెవల్ కాజ్‌వే, వరి పంటలను పరిశీలించి ఆవేదనకు లోనయ్యారు. కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే వరప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షులు నేదురమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, వాకాడు మాజీ ఏఎంసీ చైర్మన్ కొడవలూరు దామోదర్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బారులుదీరిన అభిమానం!
ముఖ్యమంత్రి వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు విద్యానగర్ నుంచి బాలిరెడ్డిపాళెం వరకు బారులు తీరారు. తమ రాకకోసం నిరీక్షిస్తున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి వారిని ఆప్యాయంగా పలకరించారు. రైతుల ఆవేదనను స్వయంగా విని చలించిపోయారు. వృద్ధురాలి కన్నీటిని తుడుస్తూ.. ‘ఏడ్వకవ్వా.. నేనున్నాను’ అంటూ భరోసానిచ్చారు. మానవత్వంతో స్పందించిన తీరుని చూసి వృద్ధురాలు సీఎం ముఖాన్ని పట్టుకుని ‘నువ్వ చల్లంగా ఉండాలి నాయనా’ అంటూ దీవెనలందించారు.
అక్కడే ఉన్న స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ‘జగన్ మామయ్యా.. జగన్ మామయ్యా’ అంటూ దీనంగా తనవంక చూసి అరుస్తున్న చిన్నారుల వద్దకు వెళ్లి బుగ్గలు నిమిరారు. ‘బాగా చదువుకో’ అంటూ ముందుకు కదిలారు. ముఖాముఖి సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను తీసుకుని వాటి పరిష్కరించాలని కలెక్టర్‌ని ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసానిచ్చారు.
శరవేగంగా సాగుతున్న సహాయక చర్యలపై సీఎం నేరుగా ప్రజలతో మాట్లాడి వారి నుంచి వివరాలు తీసుకున్నారు. బాధిత కుటుంబాలకు అందించే నిత్యావసర సరుకుల పంపిణీపైనా ఆరా తీశారు. విద్యుత్, రహదారులు, తాగునీటి సౌకర్యం పునరుద్ధరణ, పంట నష్టం అంచనాకు సంబంధించి ఎన్యూమరేషన్ ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగిన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య తమ నియోజకవర్గాల్లో జరిగిన నష్టాలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
సీఎంకు ఘన స్వాగతం..
వాకాడు మండలం, బాలిరెడ్డిపాళెం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి కోట మండలం, విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద నాయకులు ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి తానేటి వనిత ఉన్నారు. కాగా హెలీప్యాడ్ వద్ద మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి, గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు ఎమ్మెల్యేలు వరప్రసాద్‌రావు, సంజీవయ్య, మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, బల్లి కల్యాణచక్రవర్తి, వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
ఇవి చదవండి: అపోహలొద్దు.. ఆదుకుంటాం
Comments
Please login to add a commentAdd a comment