► అంగడి బొమ్మను చేసి ఆడుకున్నారు
► ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మరొకరితో పంచుకున్నాడు
► అధికారపార్టీ ఎమ్మెల్యే, ఆయన ఇద్దరు స్నేహితులకు తార్చాడు
► తట్టుకోలేని పరిస్థితుల్లో గొడవ పడిన మంజుల..
► అనంతరం శవంగా మారిన వైనం.. ఆత్మహత్యగా చిత్రీకరణ..
► నిందితులకు అండగా ఎమ్మెల్యేతో పాటు ఓ పోలీస్ అధికారి!
అనంతపురం: అనంతపురం శ్రీనివాసనగర్‌లో మూడు రోజులక్రితం జరిగిన మంజుల(మీనాక్షి) అనే యువతి ఆత్మ‘హత్య’ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. లోతుగా పోయేకొద్దీ దారుణ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమా కథను తలపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెను మరొకరితో పంచుకోవడమేగాక ఇద్దరూ కలసి అంగడిబొమ్మగా మార్చి ఆడుకున్న దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఆయన ఇద్దరు మిత్రుల వద్దకు కూడా ఆమెను పంపినట్టు వెల్లడవడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
మంజుల సోమవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆమె మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. అయితే ఆమె మృతదేహాన్ని భర్తగా పేర్కొంటున్న శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి సోమవారం రాత్రికిరాత్రే అనంతపురం సర్వజనాస్పత్రి మార్చురీ ఎదుట పడేసి వెళ్లిపోవడం అనుమానాలకు దారితీస్తోంది. తొలుత ఆమెను బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ కుమార్తె అని భావించగా.. తర్వాత పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన వడ్డె మారన్న కుమార్తెగా వెల్లడైంది. మంజులకు సంబంధించి దిగ్భ్రాంతి కలిగించే పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం వివరాలివీ..
జరిగిందిదీ..
పేదింట పుట్టిన మంజుల తమ గ్రామానికే చెందిన రాము(వెంకటరమణ చౌదరి)ని ప్రేమించింది. ఈ క్రమంలో అతను తన వెంట తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అనంతపురం ఆర్టీసీ, రైల్వేస్టేషన్లలో క్యాంటీన్ నిర్వహించే తన బంధువైన శ్రీనివాస్ చౌదరి వీరికి ఆశ్రయమిచ్చాడు. తదుపరి మంజులపై కన్నేసిన అతను రామును ఒప్పించి ఆమెను బలవంతంగా వివాహం చేసుకున్నాడు. అప్పట్నుంచీ ఇద్దరూ ఆమెతో గడుపుతూ వచ్చారు. వాటిని రహస్యంగా కెమెరాలో బంధించి.. బ్లాక్‌మెయిల్ చేసి ఆమెను అంగడిబొమ్మగా మార్చేశారు. పలువురి వద్దకు ఆమెను పంపేవారు. ఆ తరువాత అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వద్దకు ఆమెను పంపగా.. ఆయన తదుపరి తన ఇద్దరు స్నేహితుల వద్దకు కూడా మంజులను పంపినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక వ్యథకు గురైన మంజుల.. శ్రీనివాస్ చౌదరి, రాములతో తీవ్రంగా గొడవ పడుతూ వస్తోంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి శవంగా మారింది. ఆమె మృతదేహాన్ని భర్త శ్రీనివాస్ చౌదరి రాత్రికిరాత్రే అనంతపురం సర్వజనాస్పత్రి మార్చురీ ఎదుట పడేసి వెళ్లిపోయాడు. మృతురాలికి నాలుగునెలల కుమారుడున్నాడు. సంఘటన జరిగిన రోజునుంచీ బిడ్డసహా భర్తగా పేర్కొంటున్న శ్రీనివాస్ చౌదరి అదృశ్యమవడం అనేక అనుమానాల్ని రేకెత్తించింది. ఈ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో శ్రీనివాస్ చౌదరి, రామును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే నిందితుల్ని కాపాడేందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేతోపాటు రాష్ట్రస్థాయిలోని ఓ పోలీస్ ఉన్నతాధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే అసలు దోషులెవరో తేలుతారని మృతురాలి తండ్రి మారెన్న అన్నారు.
మంజుల మృతదేహానికి పోస్టుమార్టం..
ఇదిలా ఉండగా మంజుల(మీనాక్షి) మృతదేహానికి ఎట్టకేలకు సర్వజనాస్పత్రి వైద్యులు గురువారం పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు.
డీఎస్పీని కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు
మిస్టరీగా మారిన మంజుల మృతిపై సమగ్ర విచారణ జరపాలని అనంతపురం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం డీఎస్పీని కలసి వినత పత్రం సమర్పించారు. మంజులతో వ్యభిచారం చేయించిన భర్త, అతని స్నేహితుడితో పాటు టీడీపీ నేతల పాత్రపై నిగ్గు తేల్చాలని నేతలు కోరారు. అసలు మంజులు మెడికో విద్యార్థి కాదని కేసును తప్పుదారి పట్టించడానికి నిందితులు ఆడిన నాటకంగా తెలుస్తుంది. జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే వద్దకు ఆమెను పంపినట్లు అనుమనాలు ఉన్నాయని..ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. డీఎస్పీని కలిసిన వారిలో మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.