రాజంపేట: మండలంలోని సిద్దులపల్లె కొత్తరాచపల్లెలో శుక్రవారం మృతి చెందిన తోడికోడళ్ల కేసుకు సంబంధించి మిస్టరీ ముడివీడలేదు. పోలీసుల విచారణలో దివ్య, జ్యోష్న మృతులపై అనేక అనుమానాలు పుట్టుకొచ్చాయి. మృతుల సంబంధీకుల్లో పలు అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా మృతదేహాలకు శుక్రవారం రాజంపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం గది వద్దకు మృతిరాలి సంబంధీకులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. తమ బిడ్డల మృతికి అత్తింటివారే కారణమని దివ్య, జ్యోష్న తల్లిదండ్రులు విలపించారు. తమ బిడ్డలు అత్తగారింట్లో పడుతున్న కష్టాలు వివరించేవారని, ఎప్పటికప్పుడు సర్ది చెబుతూ వచ్చామని వారు తెలిపారు. కాగా జ్యోష్న తల్లి అత్తింటిలోనే శవాన్ని పూడ్చిపెట్టాలని, మృతికి కారణమైన వారిని ఊరితీయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం నుంచే మృతుల సంబంధీకులు పెద్దఎత్తున రాజంపేట రూరల్ పోలీసుస్టేషన్ వద్దకు తరలివచ్చారు. తోడికోడళ్ల సంబంధీకుల నుంచి ఫిర్యాదు తీసుకొని రూరల్ సీఐ హేమసుందరరావు పూర్తి స్ధాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ’సాక్షి’తో మాట్లాడుతూ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశామన్నారు. మృతదేహాలను సంబంధీకులకు అప్పగించామని తెలిపారు.
అదుపులో దివ్య భర్త..
తోడికోడళ్ల మృతిలో దివ్య భర్త వెంకటేశ్వరరాజు వ్యవహరించిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దివ్య భర్త కువైట్‌లో ఉంటున్నాడు. మృతి చెందిన సమాచారంతో కువైట్ నుంచి హుటాహుటిన రాజంపేటకు శుక్రవారం చేరుకున్నారు. స్ధానిక ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకున్న వెంకటేశ్వరరాజు వైఖరిని మృతుల సంబంధీకులు జీర్ణించుకోలేకపోయారు. వారిలో ఆగ్రహావేశం కట్టలు తెంచుకుంది దీంతో అక్కడే ఉన్న పోలీసులు వెంకటేశ్వరరాజును అదుపులోకి తీసుకొని రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కువైట్ నుంచి వచ్చిన వెంకటేశ్వరరాజును తోడికోడళ్ల కేసుకు సంబంధించి ముద్దాయిగా అదుపులోకి తీసుకున్నామని రాజంపేటరూరల్ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
తోడికోడళ్ల మృతిపై వీడని మిస్టరీ..!
Published Fri, Nov 18 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM
Advertisement