ఇదీ.. జిల్లా విద్యాభివృద్ధి ప్రణాళిక వ్యయం
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకే తొలి ప్రాధాన్యం
ప్రభుత్వ నిధులు, ప్రజాప్రతినిధుల వాటా, క్రూషియల్
నిధులతో కలిపి ఏడాదికి రూ.30 కోట్లు సమీకరణ
నేడు సీఎం కేసీఆర్ వద్దకు విద్యాప్రణాళిక
నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా సర్కారు బడులు అన్ని రకాల హంగులతో తీర్చిదిద్దాలంటే నికరంగా కావాల్సింది రూ.91.39 కోట్లు.. ఈ మొత్తం నిధులు విద్యాభివృద్ధికి కేటాయిస్తే తప్ప.. ప్రస్తుతం పాఠశాలల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదు. పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ సూచనల మేరకు జిల్లా విద్యాశాఖ అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను సమీకరించి సమగ్ర ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ బుధవారం నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో విద్యాప్రణాళికను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు స్థానిక అధికార యంత్రాంగం జిల్లాల పునర్విభజన తర్వాత నల్లగొండకు చెందిన 31 మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ప్రకారంగా ప్రణాళిక సిద్ధం చేసింది. రూ.91.39 కోట్లతో రూపొందించిన ప్రణాళికలో ప్రధానంగా నాలుగైదు అంశాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చింది.
ప్రాధాన్యత అంశాలు
శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను పూర్తిగా తొలగించి కొత్త భవనాలు నిర్మించడంతో పాటు అవసరైన చోట అదనపు తరగతి గదుల నిర్మాణం
పాఠశాలలో మరుగుదొడ్ల ఏర్పాటు
మరుగుదొడ్లలో నీటి వసతి..
తాగునీటి సౌకర్యం..
విద్యుత్ సౌకర్యం, సామగ్రి సమకూర్చుకోవడం..
ప్రణాళిక ఇదీ....
జిల్లాల పునర్విభజన తర్వాత నల్లగొండలో మొత్తం 1478 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 1,120, ప్రాథమికోన్నత 131, హైస్కూళ్లు 227. వీటిలో తరగతి గదులు లేని ప్రాథమిక పాఠశాలలు 243, యూపీఎస్‌లు 37, హైస్కూళ్లు 83 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పాఠశాలలకు తరగతి గదులు నిర్మించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఒక్కో తరగతి గదికి రూ.7.40 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో నిర్మించే తరగతి గదికి రూ .8.75 లక్షలు ఖర్చువుతాయని అంచనా వేశారు. మరుగుదొడ్లులేని పీఎస్‌లు–13, యూపీఎస్–1, ఉన్నత పాఠశాలలు–120 ఉన్నాయి. వీటిలో మరుగుదొడ్ల నిర్మించేందుకు ఒక్కో దానికి రూ.1.95 లక్షల చొప్పున అవసరమని అంచనాలు రూపొందించారు.
నీటి వసతి లేకుండా మరుగుదొడ్లు మాత్రమే ఉన్న పీఎస్‌లు–622, యూపీఎస్‌లు–61, ఉన్నత పాఠశాలలు –72 ఉన్నాయి. ఈ మేరకుఒక్కో పాఠశాలల కు రూ.1.35 లక్షల చొప్పున అంచనా వేశారు.
విద్యుత్ సౌకర్యం లేని పాఠశాలలు పీఎస్‌లు– 140, యూపీఎస్‌లు–11, ఉన్నత పాఠశాలలు–8 ఉన్నాయి. ఒక్కో పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలంటే రూ.35 వేలు ఖర్చవుతుందని పేర్కొన్నారు.
l1478 పాఠశాలల్లో ఫర్నిచర్ లేదు. విద్యార్థులు తేలిగ్గా చదువుకునేందుకు, పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే డ్యూయల్ డెస్క్‌లు అవసరం. 1478 పాఠశా లల్లో 46,076 డ్యూయల్ డెస్క్‌లు అవసరమని ప్రణాళికలో పేర్కొన్నారు. ఒక్కో పాఠశాలలో డ్యూయల్ డెస్క్‌కు అయ్యే అంచనా వ్యయం రూ.45 వేలుగా నిర్ణయించారు.
ప్రహరీలు లేని పీఎస్‌లు–443, యూపీఎస్‌లు– 20, ఉన్నత పాఠశాలలు–33 ఉన్నాయి. ఒక్కో ప్రహరిగోడ నిర్మాణానికి రూ.5.70 లక్షల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఒక్క హై స్కూల్‌లో మాత్రమే గ్రంథాలయం లేదు. దీనికి రూ.25 వేలు కావాలని ప్రణాళికలో పేర్కొన్నారు. సైన్స్ ల్యాబ్‌లు లేని ఉన్నత పాఠశాలలు 166 ఉన్నాయి. ఈ మేరకు ఒక్కో పాఠశాలకు రూ.50 వేల చొప్పున అవసరమవుతాయని అంచనాలు రూపొందించారు.
నిధుల సమీకరణ..
రూ.91 కోట్ల ప్రణాళిక ఆచరణలోకి రావాలంటే జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను కూడా ప్రణాళికల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ నిధుల నుంచి నియోజకవర్గానికి రూ.కోటి, కలెక్టర్ లేదా ఇన్‌చార్జి మంత్రి క్రూషియల్ నిధుల నుంచి నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున కేటాయిస్తే.. ప్రభుత్వం తన వాటా కింద నియోజకవర్గానికి రూ.3 కోట్లు విడుదల చేస్తుంది. ఈ లెక్కన నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు ఒక్కోదానికి రూ.5 కోట్ల చొప్పున ఏడాదికి రూ.30 కోట్లు నిధులు సమీకరించుకోవ చ్చని తెలిపారు. ఇప్పటివరకు నాగార్జునసాగర్, దేవరకొండ ఎమ్మెల్యేలు, ఎంపీ గుత్తా మాత్రమే తమ కోటా నిధులు పాఠశాలల అభివృద్ధికి కేటాయించారు.
సాంకేతిక వైపు అడుగులు..
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం కలిగించేలా, విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని.. ముందుగా మౌలిక వసతులు, విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి కల్పించేలా ప్రణాళికలు రూపొందించామని అధికారులు తెలిపారు. ఇవన్నీ లేకుండా పాఠశాలల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. డిజిటల్ విద్యాబోధన అమలు, ప్రభుత్వ పాఠశాలల్లోనే పదో తరగతి పరీక్షల నిర్వహణ, బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టాలని నిర్ణయించిన దాని ప్రకారం ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలంటే ఉనికి కోల్పోతున్న సర్కారు బడులను ఊపిరిపోయాల్సిన అవసరం ఉందని.. అందుకే ఆ దిశగా ప్రణాళికలు రూపొందించామని చెబుతున్నారు.
91.39 కోట్లు..
Published Wed, Dec 14 2016 3:24 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Advertisement