102 తలలు.. తెగిపడ్డాయి! | Nalgonda district social malfeasance | Sakshi
Sakshi News home page

102 తలలు.. తెగిపడ్డాయి!

Published Sun, Apr 17 2016 4:48 AM | Last Updated on Tue, Nov 6 2018 5:52 PM

102 తలలు.. తెగిపడ్డాయి! - Sakshi

102 తలలు.. తెగిపడ్డాయి!

* పోలీసుల పహారాలోనే దున్నపోతులు బలి
* నల్లగొండ జిల్లాలో సామాజిక దురాచారం
* శ్రీ రామనవమి పేరిట వింత ఆచారం

సాక్షి, హైదరాబాద్: అదో గిరిజన తండా.. అనాదిగా కొలుస్తున్న అమ్మవారి కోసం అక్కడ ఏటా పెద్ద సంఖ్యలో జంతు బలులు జరుగుతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు, దశాబ్దాలుగా ఈ బలి కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది.. ఒక్క వేటుకు ఒక్కో దున్నపోతు తల తెగి పడాల్సిందే. ఆ దున్నపోతు తలను వచ్చే ఏడాది వరకు గుంతలో పూడ్చి ఉంచాల్సిందే.

మళ్లీ మరుసటి ఏడాది కొత్త తలలు తెగినప్పుడు.. పాత తలలు బయటకు తీస్తారు. అలా బలి ఇస్తే అమ్మవారు తాము కోరిన కోర్కెలు తీర్చుతుందని భక్తుల నమ్మకం. కంకాళి భవానీ (అంకాలమ్మ) జాతర పేరుతో శ్రీరామనవమి మరుసటి వేకువజామున నిర్వహించే ఈ మూఢాచార కార్యక్రమం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు. ఈ ఒక్క ఏడాదే 102 దున్నపోతులు తెగిపడ్డాయంటే భక్తుల నమ్మకం ఎలా ఉందో.. శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో దూసుకుపోతున్న నవీన యుగంలో కూడా మూఢాచారాల పట్ల ప్రజల విశ్వాసం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నల్లగొండ జిల్లా పెదవూర మండలం రామన్నగూడెం తండా పరిధిలోని కంకాళి భవానీ అమ్మవారికి ఇచ్చే బలులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
 
అసలు కథ ఇదీ..
గిరిజనులు ఆరాధ్యదైవంగా భావించే పెదవూర మండలంలోని రామన్నగూడెంలో కొలువై ఉన్న కంకాళి భవానీ (అంకాలమ్మ), లాల్‌సాద్, గురునానక్‌ల జాతరను ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండగ తర్వాతి రోజున ఘనంగా నిర్వహించటం పరిపాటి. లాల్‌సాద్ అనే గిరిజనుడు ప్రతి ఏటా మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉన్న కంకాళి భవానీ ఆలయానికి వెళ్లి వచ్చేవాడు. అప్పట్లో రవాణా సదుపాయం లేకపోవడంతో అక్కడికి వెళ్లడం ఇబ్బందిగా మారింది.

దీంతో రామన్నగూడెంలో 1944వ సంవత్సరంలో కంకాళి భవానీ అమ్మవారిని ప్రతిష్టించి గుడిని నిర్మించాడు. దీంతో పరిసర తండాల్లోని గిరిజనులు ఈ గుడికి వచ్చి పూజించేవారు. అలా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం వంటి జిల్లాలకు పాకింది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి పర్వదినం మరుసటి రోజున కంకాళి భవానీ జాతర జరుగుతోంది. లాల్‌సాద్ మరణానంతరం ఆయన కుటుంబికులే వంశపారంపర్యంగా ఈ గుడికి పూజారులుగా ఉంటున్నారు.

అయితే, ఇక్కడి ఆచారమేమిటంటే.. తాము కోరుకున్న కోర్కెలు తీరితే దేవతకు దున్నపోతులను బలిస్తామని మొక్కుకుంటారు.  గిరిజనులే కాకుండా ఇతరులు కాకుండా ఇలా దున్నపోతులను బలి ఇచ్చి మొక్కులను తీర్చుకుం టున్నారు. జాతర రోజు వేకువ జామున కంకాళి భవానీ దేవాలయం ముందు ఈ తతంగం ప్రారంభించి, సూర్యుడు ఉదయించే వరకు పదునైన పెద్ద కత్తులతో దున్నపోతులను నరుకుతారు. దున్నపోతుల కళేబరాలను మాత్రం స్థానికులు కొందరు వండుకుని తింటారని సమాచారం. అయితే. ఈ తతంగమంతా పోలీసు పహారాలోనే జరుగుతుండ డం గమనార్హం.
 
కనీవినీ ఎరుగని రీతిలో బలి..
అంకాలమ్మ దేవాలయం ముందు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో శనివారం వేకువజామున 102  దున్నపోతులను బలి ఇచ్చారు. వీటి మొండేలను సమీప గ్రామాలకు చెందిన ప్రజలకిస్తారు. పక్క గ్రామానికి చెందిన 40 కుటుంబాల వారు కంకాళి భవానీకి బలి ఇచ్చిన దున్నల కళేబరాలను పంచుకుంటారని తెలుస్తోంది. దేవాలయం వద్ద నుంచి దున్నపోతుల మొండేలను ట్రాక్టర్‌లో తరలించి పంపకాలు చేసుకుని వాటిని ఆరగిస్తారు. గిరిజన భక్తులు దేవతలకు బెల్లం, రొట్టెలను, పరమాన్నాన్ని సమర్పించారు.  కొందరు భక్తులు తలనీలాలు సైతం ఇస్తుంటారు.

దున్నపోతులను బలి ఇవ్వడం పూర్తికాగానే.. మేకపోతులు, గొర్రెపోతులను కూడా దేవతామూర్తి ముందు బలియిచ్చి మొక్కులు తీర్చుకుని అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేస్తారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఈ  సామాజిక అనాచారంపై స్థానికుడొకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ కష్టకాలం వచ్చినప్పుడు అభయమిచ్చే కంకాళి భవానీ మాతకు మొక్కుకుంటే తప్పక కష్టాలు తీరుతాయని చెప్పాడు. ఇన్నేళ్లలో ఎన్నడూ రానన్ని దున్నపోతులను ఈ ఏడాది భక్తులు అమ్మవారికి బలి ఇచ్చారని, ఏటేటా జాతరకు జనం పెరుగుతున్నారని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement