– ఇంటింటికి వెళ్లి ప్రజల్ని వైఎస్‌ఆర్ కుటుంబ సభ్యులు చేయాలి
– కర్నూలు నియోజకవర్గ నవరత్నాల సభలో ఎంపీ బుట్టా రేణుక
– ఇద్దరు టీడీపీ నాయకులు పార్టీలో చేరిక
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రజాసంక్షేమం కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను తీసుకొస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక చెప్పారు. బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికి వెళ్లి వాటి గురించి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి స్థానిక రాయల్ ఫంక‌్షన్ హాల్‌లో పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి అధ్యక్షతన నవరత్నాల సభ నిర్వహించారు. ఈ సభకు ఎంపీ బుట్టా రేణుక అతిథిగా హాజరై ప్రసంగించారు. నవరత్నాల గురించి బూత్ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు.
ఎక్కడ నీరు ఉంటే అక్కడే అభివృద్ధి..
నీరు ఎక్కడ పుష్కలంగా ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుందని ఎంపీ అన్నారు. అందుకే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞనం ద్వారా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే, ఆయన అకాల మరణంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే పెండింగ్‌ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాష్ట్రంలో సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తారని చెప్పారు. రాజన్న రాజ్యం తెచ్చుకునేందుకు పార్టీశ్రేణులు ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలు సైనికులు కాదు..యోధులు: హఫీజ్‌ఖాన్
వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు సైనికులు కాదు యోధులని, వారి పోరాటాలే పార్టీకి కొండంత బలమని కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. నంద్యాలలో అధికార పార్టీ నాయకులు ప్రజలను ప్రలోబాలకు..బెదిరింపులకు గురిచేసి గెలిచారన్నారు. వాస్తవంగా నైతిక గెలుపు తమదేనని చెప్పారు. జగనన్న ప్రవేశపెట్టిన తొమ్మిది రకాల పథకాల గురించి ప్రజలకు తెలియజేసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. టీడీపీలో రౌడీషీటర్లు ఉన్నారని సామాన్యుడు తిరగబడితే వారు కొట్టుకుపోతారని చెప్పారు. ప్రజలకు మంచినీరు అందించడంలో, దోమల నివారణ చర్యలు చేపట్టడంలో నగర పాలక సంస్థ పూర్తిగా విఫలమైందన్నారు. ఎంపీ నిధుల నుంచి నగరంలో బోర్లు వేయించి నీటి ఎద్దడి నుంచి ఉపశమనం కలిగించాలని హఫీజ్ ఖాన్ ఎంపీని కోరారు.
అంతకుముందు తెర్నేకల్ సురేందర్‌రెడ్డితో పాటు మైనారిటీ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.ఎ.రహ్మాన్, మద్దయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయకుమారి, సలోమి మాట్లాడారు. కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యంయాదవ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, వివిధ శ్రేణుల పార్టీ నాయకులు డి.కె.రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ దాదామియ్య, సాంబశివారెడ్డి, నాగేశ్వరరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, జగన్‌రెడ్డి, జాన్, ధనుంజయాచారి, మహమ్మద్ తౌఫిక్, పేలాల రాఘవేంద్ర, సఫియా ఖాతూన్, వాహిద తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన టీడీపీ నాయకులు..
టీడీపీ మాజీ నగర అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డితో పాటు మహిళా నాయకురాలు జమీలా ఎంపీ బుట్టా రేణుక, హఫీజ్‌ఖాన్‌ల సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.