ఎదురు చూడాలా? ఎక్కడైనా చేరాలా?
ఎదురు చూడాలా? ఎక్కడైనా చేరాలా?
Published Sun, Jun 18 2017 10:59 PM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM
-‘నవోదయ’ ప్రవేశపరీక్ష రాసిన విద్యార్థుల సందిగ్ధం
-ఐదు నెలలైనా వెల్లడి కాని ఫలితాలు
-ఏటా బడులు తెరిచే నాటికే విడుదల
రాయవరం (మండపేట) : జవహర్ నవోదయ విద్యాసంస్థలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించి ఐదు నెలలు కావస్తోంది. ఫలితాలు విడుదలైతే నవోదయలో చేరుదామనే ఆశతో వేలాదిమంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. నవోదయ పరీక్ష రాసిన పిల్లల తల్లిదండ్రులు కూడా ఫలితాల కోసం ఆదుర్దాగా నిరీక్షిస్తున్నారు. బిడ్డలు నవోదయలో సీటు సాధిస్తే సరేసరి, లేకుంటే వేరే స్కూళ్లో చేర్చడానికైనా ఫలితాలు వస్తే బాగుండుననుకుంటున్నారు.
పల్లెల్లోని ప్రతిభావంతుల కోసం..
గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అధునాతన విద్యావిధానాన్ని అందించడం కోసం 1986లో రూపొందించిన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించింది. ఈ పాఠశాలల్లో విద్యనభ్యసించే చిన్నారులకు హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో నాణ్యమైన విద్యనందిస్తారు. ఈ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాసి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మాత్రమే అవకాశం లభిస్తుంది. 6వ తరగతిలో పరిమితంగా 80 సీట్లే ఉండడంతో అంతే మంది విద్యార్థులను చేర్చుకుంటారు. దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఈ ఏడాది జనవరి 8న నిర్వహించారు. జిల్లాలో 80 సీట్లకు 64 కేంద్రాల్లో 13,600 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పరీక్ష ఫలితాలు విడుదల కాలేదు. గతేడాది పాఠశాలల ప్రారంభ సమయానికి ఫలితాలు విడుదలయ్యాయి.
ఆలోచనలో తల్లిదండ్రులు..
గత సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఐదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆరవ తరగతిలో ఎక్కడ చేర్పించాలోనన్న ఆలోచనలో పడ్డారు. నవోదయ పరీక్ష రాసిన విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ప్రైవేటు పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించి తమ చిన్నారులను చేర్చిన అనంతరం నవోదయలో సీటు వస్తే పత్రాలు తీసుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పరీక్ష రాసి ఐదు నెలలైనా.. నేటికీ ఫలితాలు విడుదల కాకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా వీటి ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫలితాలు రాక సందిగ్ధం
పాఠశాలల పునఃప్రారంభం నాటికే నవోదయ ఫలితాలు విడుదల చేస్తే ప్రయోజనం ఉంటుంది. మా పాప లీలామాధురి నవోదయ ఎంట్రెన్స్ పరీక్ష రాసింది. ఐదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించింది. వేరే పాఠశాలలో చేర్పించాలా, వద్దా అనే మీమాంసలో ఉన్నాం.
– కన్నూరి అర్జునుడు, టీచర్, రాయవరం
ఇంత ఆలస్యం అనుచితం..
నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ముందుగానే విడుదల చేసేవారు. ఈ ఏడాది బాగా ఆలస్యం అయిందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏ పాఠశాలలో చేర్పించాలో నిర్ణయించుకోలేక పోతున్నారు. ఫలితాలు త్వరితగతిన విడుదల చేస్తే మంచిది.
– పి. సుబ్బరాజు, అధ్యక్షుడు, ఎస్టీయూ
Advertisement