మంచి పుస్తకం.. మస్తక పోషకం
మంచి పుస్తకం.. మస్తక పోషకం
Published Mon, Nov 21 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
రాజమహేంద్రవరంలో ‘నవ్యాంధ్ర పుస్తక సంబరాలు
ఆర్ట్స్ కాలేజీలో ఈ నెల 27 వరకూ నిర్వహణ
99 స్టాళ్లలో అందుబాటులో లక్షలాది పుస్తకాలు
నీతికథల నుంచి ఆత్మకథల వరకూ లభ్యం
కొనుగోళ్లపై 10 నుంచి 30 వరకూ రాయితీ
పూలరేకుల్లోని వన్నెలకూ, అవి వెదజల్లే సుగంధాలకూ నేల పొరలలోని సారమే మూలం. తిండిగింజలలోని పోషక విలువలకూ, పండ్లలోని చవులూరించే మాధుర్యానికీ కూడా ఆ సారమే మూలం. మనుగడకు వివిధ దినుసులూ, కాయలూ, ఖనిజాలకు మూలం మట్టిలోని సారమైనట్టే.. గుహావాసాల దశ నుంచి గ్రహాంతరవాసాల ప్రతిపాదనల వరకూ మానవ ప్రస్థాన పురోగతికి జ్ఞానమే మూలం. సారాన్ని నిక్షిప్తం చేసుకున్న నేలపొరల్లాగే..జ్ఞానసారాన్ని తమలో పొదువుకున్న పుస్తకాలు కూడా. ప్రాణవాయువు నెత్తురును శుద్ధి చేసినట్టు పుస్తకాలు.. కలుషిత చిత్తాన్ని ప్రక్షాళన చేస్తాయి. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చిన సాధనాలతో ‘అచ్చు’ పుస్తకానికి కాలం చెల్లిందన్న అభిప్రాయం ఉంది. అయితే.. ఆ సాధనాల ఆవిష్కరణకు మూలం.. తరతరాల మానవులు పుటల నడుమ కూడబెట్టిన పెన్నిధేనన్నది ‘అక్షర’ సత్యం. రాజమహేంద్రవరంలో తొలిసారిగా నవ్యాంధ్ర పుస్తక సంబరాలు నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లోని నన్నయ్య ప్రాంగణంలో ఈ నెల 19న ప్రారంభమైన ఈ వేడుక ఈ నెల 27 వరకు కొనసాగనుంది.
సాక్షి, రాజమహేంద్రవరం/ కల్చరల్ : ‘పుస్తకం హస్తభూషణం’ అన్నారు ఒకనాడు. ‘స్మార్ట్‌ఫోన్ లేని కరము కరమే కాదు’ అంటున్నారు నేడు. అయినా.. ఏనాడైనా పుస్తకం హస్తభూషణమే కాదు మస్తకానికి ఔషధం అన్నది ‘అచ్చులే భాషకు ప్రాణసమం’ అన్నంత పరమసత్యం. తెలుగు గడ్డకు సాంస్కృతిక రాజధానిగా, ఆదికావ్యం జాలువారిన గడ్డగా గణుతికెక్కిన రాజమహేంద్రవరంలో తొలిసారిగా భారీస్థాయిలో పుస్తకోత్సవం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగువారి ‘పుస్తక ప్రేమ’ను గురించి అలనాటి గురజాడ నుంచి నిన్నటి ముళ్ళపూడి వెంకట రమణ వరకు చేసిన వ్యాఖ్యలను సరదాగా గుర్తు చేసుకుందాం. శతాబ్దికి ముందే మహాకవి గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకానికి ముందుమాటలో ఇలా పేర్కొన్నారు.. 'తెలుగుదేశంలో గ్రంథకర్త అయినవాడు తన పుస్తకాలు తానే అచ్చొత్తించుకోవాలి. తానే అమ్ముకోవాలి'.. మరో యాభై ఏళ్ల తరువాత జయంతి çపబ్లికేషన్స్ ఆధ్వర్యంలో ప్రచురించిన గురజాడ ‘కన్యాశుల్కం’ మలిముద్రణలలో మహాకవి శ్రీశ్రీ తన ముందుమాటలో ' ఆ నాటి మహాకవి అన్నమాట ఈ నాటికీ యథార్థంగానే ఉంది' అన్నారు. శ్రీశ్రీ వ్యాఖ్యలు నాడే కాదు, నేటికీ ఆ మాట ప్రాధాన్యతను కోల్పోలేదు. కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు పుస్తకాలు కొనడానికి ఒక్క దమ్మిడీ ఇవ్వనని చెబుతూనే 'నేను వేదం యాభైరెండు పన్నాలూ ఒహ దమ్మిడీ ఖర్చు లేకుండా చదువుకున్నాను' అని ఖండితంగా చెపుతాడు. ముళ్ళపూడి వెంకట రమణ ‘గిరీశం లెక్చర్ల’లో గిరీశం ఇలా అంటాడు..‘పుస్తకాలు కొనడమా! బార్బేరియస్, వర్స్ దేన్ సెల్లింగ్ గర్ల్స్’. అవన్నీ అలా ఉంటే.. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో–దాని జేబుల్లో డబ్బులుంటే మంచి పుస్తకం కొనుక్కో’ అన్న వజ్రపు తునకలాంటి పలుకూ ఉంది.
ప్రముఖ ప్రచురణ సంస్థల భాగస్వామ్యం
పాఠకులకు తమకు కావలసిన పుస్తకం ఎక్కడ లభ్యమవుతుందో తెలిపే వ్యవస్థ, ప్రచురణ కర్తకు తాను ముద్రించే పుస్తకాన్ని కొనుగోలు చేసే పాఠకులెవరో తెలిపే వ్యవస్థ నేటికీ రూపు దిద్దుకోలేదు. ఈ నేపథ్యంలో అడపాతడపా జరిగే పుస్తక ప్రదర్శనలు విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజమహేంద్రవరంలో జరుగుతున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో 99 స్టాళ్లు ఏర్పాటు చేశారు. అన్ని ప్రముఖ ప్రచురణ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ వంటి సంస్థలు లక్షలాది పుస్తకాలను అందుబాటులో ఉంచాయి. సాహిత్యం, నీతి కథలు, బొమ్మల కథలు, యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనా రాణి, మాదిరెడ్డి సులోచనారాణి, షేక్‌స్పియర్ వంటి ప్రముఖులు రచించిన తెలుగు, ఇంగ్లిష్ నవలలు, అలనాటి సాహితీ వేత్తల ఆత్మకథలు, రాజకీయపరమైన పుస్తకాలు, ప్రముఖ జర్నలిస్టులు, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తల ఆత్మకథలు ఇక్కడ అందుబాటులో ఉంచారు.
కొనుగోలుదారులకు అన్ని రకాల పుస్తకాలపై 10 శాతం రాయితీ ఇస్తున్నారు. ఎంపిక చేసిన కొన్ని పుస్తకాలకు 30 శాతం రాయితీ కల్పించారు. పిల్లలు స్కెచ్ పెన్నులతో సులువుగా బొమ్మలు వేసేందుకు అవసరమైన బ్లోపెన్, మేజిక్ మిర్రర్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. క్రాఫ్ట్ బజార్‌లు, ఇంట్లోనే కంప్యూటర్ నేర్చుకునేందుకు అవసరమైన సీడీల స్టాళ్లు ఏర్పాటు చేశారు.
పుస్తకాల పైనా పెద్దనోట్ల రద్దు నీడ..
పాత రూ.వెయ్యి, రూ. 500 నోట్ల రద్దు ప్రభావం పుస్తక ప్రదర్శనపై కూడా పడింది. రాజమహేంద్రవరంలో మొదటిసారి పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినా గత మూడు రోజులుగా స్టాళ్ల యజమానులు ఆశించిన మేర అమ్మకాలు జరగలేదు. అదేవిధంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటుపై ప్రచార లేమి కూడాకొనుగోళ్లు తగ్గిపోవడానికి ఓ కారణం.
పిల్లల కోసం పుస్తకాలు కొన్నా..
పిల్లలను తీర్చిదిద్దడానికి పుస్తకాలు ఎంతో అవసరం. స్కూళ్లో పాఠాలతోపాటు నీతి కథలు చెబితే వారికి సమాజంపై అవగాహన ఉంటుంది. అందుకే వారికి అవసరమైన పుస్తకాలనే ఎక్కువగా కొన్నాను.
– పోసమ్మ, క్రాఫ్ట్ టీచర్, తంటికొండ
ఒకే చోట దొరకడం సౌలభ్యం
ఇంటర్‌నెట్‌లో సమస్త సమాచారం ఉన్నా పుస్తక పఠనం ఎంతో అవసరం. ఏదైనా పుస్తకం కావాలంటే అనేక దుకాణాలు తిరగాలి. ఇలాంటి ప్రదర్శన వల్ల అన్ని పుస్తకాలు ఒకే చోట లభించడం సౌలభ్యంగా ఉంది.
– పద్మలత, టీచర్, రాజమహేంద్రవరం
లక్కీ డ్రా విజేతలకు బహుమతులు
ప్రదర్శనలో కొనుగోలుదారులకు లక్కీ డ్రా ద్వారా ప్రత్యేక గిఫ్ట్‌లు ఇస్తున్నాం. ఇద్దరికి రూ.2000, మరో ముగ్గురికి రూ.1000, ఐదుగురికి రూ. 500 చొప్పన విలువైన పుస్తకాలిస్తాం. వారికి నచ్చిన పుస్తకాలు ఎంపిక చేసుకోవచ్చు.
– అనిరుథ్, ఎమెస్కో బుక్స్ ప్రతినిధి
Advertisement