నీలినీడలు
Published Wed, Mar 15 2017 12:57 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు :డెల్టా ఆధునికీకరణ పనులు ఈ ఏడాది కూడా జరిగే అవకాశం కనబడటం లేదు. ఈ జిల్లా రుణం తీర్చుకోలేనిదంటూ ఇక్కడ పర్యటించినప్పుడల్లా ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి సమస్యలపై మాట్లాడిన పాపాన పోలేదు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి, జానంపేట అక్విడెక్ట్ వద్దకు తరచూ రావడం, మీడియాతో మాట్లాడి వెళ్లడం తప్ప జిల్లాలోని సాగునీటి ఇబ్బందులపై ఏనాడూ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఈ ఏడాది ఆధునికీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇంకా అమోదానికి నోచుకోలేదు. దీంతో ఈ పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రూ.136 కోట్లతో
167 పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొం దించిన జల వనరుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వీటికి జనవరి నెలలోనే అమోదం లభించి, టెండర్లు పూర్తవ్వాల్సి ఉంది. అలా జరిగి తేనే కాలువలు మూసివేసిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉండేది. ఈ నెలాఖరు నాటికి కాలు వలు మూసివేసేందుకు యంత్రాంగం నిర్ణయించగా, ఆధునికీకరణ పనుల ప్రతిపాదనలకు ఆమోదం రాలేదు. ఫలితంగా టెండర్లు పిలిచే అవకా శం లేకుం డాపోయింది. ఇప్పటికప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. టెండర్లు ఖరారయ్యేందుకు నెల రోజులు పడుతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఆమోదం లభించినా ఆదరాబాదరాగా పనులు చేపట్టి తూతూమంత్రంగా ముగించే ప్రమాదం ఉంది. గత ఏడాది రూ.72 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవగా.. అప్పట్లో పనులు చేపట్టలేదు. ఈ ఏడాది ఆ పనులతో సరిపెట్టే అవకాశం కనపడుతోంది. రూ.1,300 కోట్లతో డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకూ రూ.700 కోట్ల విలువైన పనులు కూడా పూర్తికాలేదు. 2012లో దీర్ఘవిరామం (లాంగ్ క్లోజర్) సమయంలో మాత్రమే ఓ మాదిరిగా పనులు జరిగాయి. తర్వాత ఏటా మొక్కుబడి పనులతో సరిపెడుతూ వస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ రూ.112 కోట్ల విలువైన పనులు మాత్రమే చేశారు. పంట కాలువలు పూడుకుపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా పొలాలు ముంపునకు గురవుతున్నాయి. సాధారణ రోజుల్లో మాత్రం పంట కాలువల్లో నీరు పారక వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. 2015లో డిసెంబర్‌లో కురిసిన చిన్నపాటి వర్షాలకు 1.32 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. 2016లోనూ వర్షాలకు నారుమడులన్నీ నీట మునిగి రైతులు ఇబ్బందులు పడ్డారు. కాలువల ఆధునికీకరణ జరగకపోవడం వల్ల ఖరీఫ్‌తోపాటు రబీలోనూ నీటి సమస్యతో రైతులు కష్టాలు పడుతున్నారు. గడచిన రెండేళ్లలో అయిల్ ఇంజిన్లు, నీటి మోటార్లు ఉపయోగించకుండా రైతులు పంట పండించలేని పరిస్థితి ఏర్పడింది.
Advertisement