తవ్వారు.. వదిలేశారు..
ముందు చూపు లేని నీరు–చెట్టు పని
తీసిన మట్టి కాలువల్లోకి జారుతున్న వైనం
పూడిక తరలింపునకు నిధులు లేవంటున్న అధికారులు
సాలూరు : ఏదైనా పని చేపడితే దానిని కడదాకా పూర్తి చేయాలి. పూర్తిస్థాయిలో చేయగలమా... లేదా అన్నది ముందుగానే గుర్తించాలి. అది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. కానీ అధికారులు చేస్తున్న పనులు చూస్తుంటే... తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్టుంది. సాలూరులో చేపట్టిన పనులు ఈ విషయాన్ని అక్షరాలా రుజువు చేస్తున్నాయి. సాలూరు మున్సిపాలిటీ పరిధిలోనున్న పేరసాగరం చెరువులోకి పాచిపెంట మండలంలోని చెరుకుపల్లి గెడ్డ, పెద్దగెడ్డ పంట కాలువల నుంచి వరద నీరు 26వ నంబరు జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న కాలువల ద్వారా చేరుతుంది. వరద నీరు పారేందుకు అనువుగా రెండు కాలువలు లేవు. పూడికలతో నిండిపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా, వర్షంనీరు నేరుగా రోడ్డుపైన, ఆర్టీసీ కాంప్లెక్స్‌లోనికి వచ్చేయడం, రామాకాలనీ నీట మునగడం సాధారణమైపోయింది.
నీరుచెట్టుతో పూడిక తీత
నీటిపారుదలశాఖ అధికారులు నీరుచెట్టు కార్యక్రమంలో భాగంగా కాలువల్లో గతంలో పూడికలను తొలగించారు. పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో మరిన్ని నిధులు రప్పించారు. చెరుకుపల్లి కాలువలో 1800మీటర్ల పొడవునా పూడికలు తొలగించేందుకు రూ. 2లక్షలు, రోడ్డుకు అవతలవైపున్న పెద్దగెడ్డ కాలువలో 800 మీటర్ల పొడవునా పూడికతీతకు రూ. 90లక్షలు మంజూరయ్యేలా చేశారు. మొత్తమ్మీద యంత్రాలసాయంతో పూడికతీతపనులు పూర్తిచేశారు. కాలువల్లో లోతుగా పూడికలు తీయడంతో స్థానికులనుంచి హర్షం వ్యక్తమైంది. అసలు తిరకాసు అక్కడే మొదలైంది. కాలువల్లో తీసిన పూడికలు ఎక్కడికక్కడే నిల్వ ఉంచేశారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో తీసిన పూడిక మట్టి మరలా కాలువల్లోకి జారుతుండడమే కాదు... రోడ్డంతా బురదమయమైంది.
పూడిక తరలించేందుకు నిధుల్లేవట!
కాలువల్లో నుంచి తీసిన పూడికలు వేరేచోటకు తరలించేందుకు నీరుచెట్టు పథకం ద్వారా నిధులు మంజూరుకు అవకాశం లేదంట. అందుకే పూడిక అలా వదిలేశారంట. తీసిన మట్టిని తరలించే అవకాశంలేనపుడు ఆ పనులు చేపట్టడం ఎందుకు... ఇప్పుడు తీసిన మట్టి మళ్లీ కాలువల్లోకి వెళ్తే తీసిన ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
మున్సిపాలిటీ అధికారులు స్పందించలేదు
నీటిపారుదలశాఖ జేఈ సాయి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కాలువల్లో పూడికతీతపనులు చేపట్టామని. తీసిన పూడికలను తరలించేందుకు నీరుచెట్టు పథకంలో అవకాశం లేదన్నారు. ఎవరూ తరలించకపోవడంతో మున్సిపాలిటీ నిధులతో తరలించాలని లేఖ రాశానని తెలిపారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నీటిపారుదలశాఖ ఎస్‌ఈ దష్టికి సమస్యను తీసుకువెళ్లానన్నారు. ఆయన కలెక్టర్‌తో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా చేస్తామని తెలిపారని, ఉత్తర్వులు రాగానే పూడికలను తరలిస్తామని వివరించారు.