చింతామల గిరిజనులు సొంతంగా వేసుకున్న రహదారి, (ఇన్‌సెట్లో) గిరిజనుల కలను సాకారం చేస్తున్న ‘సాక్షి’ కథనం.
‘అక్షరం’ అనేక జీవితాలను నిలబెడుతుందని... చరిత్రను ‘కలం’ తిరగరాస్తుందని... మరోసారి రుజువైంది. శతాబ్దాలుగా రహదారులు లేక... అభివృద్ధికి నోచుకోక... కాలం వెళ్లదీస్తున్న గిరిజనుల కష్టాలను, కన్నీళ్లను కళ్లకు కట్టినట్లు చూపించిన ‘అరణ్య రోదన’ కథనం అడవి బిడ్డల కలలను సాకారం చేస్తోంది. చేయీ.. చేయీ కలిపి చందాలు పోగేసి మొదలుపెట్టిన మట్టి రోడ్డు ఇప్పుడు ప్రధాన రహదారిగా రూపుదిద్దుకోనుంది.
సాక్షి, విజయనగరం: సాలూరు మండలం కొదమ పంచాయతీ చింతామల గిరిశిఖర గ్రామ ప్రజలు, నూట ఇరవై ఐదు కుటుంబాలు కలిసి, బంగారం, భూమి తాకట్టు పెట్టి, ఆవులు, గేదెలు, మేకలను అమ్మి, అదీ చాలక షావుకారు వద్ద అప్పుచేసి, ఇంటికి రూ.7 వేలు చొప్పున చందాలు వేసుకున్నారు. మరికొంత రుణాలు తీసుకున్నారు. ఆ సొమ్ముతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా బారి జంక్షన్ వరకూ సొంతంగా రహదారి వేసుకున్నారు. దీనిపై సాక్షి ప్రధాన సంచికలో ఆగస్టు 14న కథనం ప్రచురితమైంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం కార్యాలయం జిల్లా అధికారులను వివరాలు కోరింది. మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో సాక్షి కథనం గురించి ప్రస్తావన
గిరిజనులను అభినందించారు. త్వరలోనే వచ్చి కలుస్తానన్నారు. కదిలించిన సాక్షి కథనం ఈ క్రమంలోనే గిరిజనులు అనుభవిస్తున్న కష్టాలపై ‘అరణ్య రోదన’ శీర్షికతో ఆగస్టు 25న సాక్షి జిల్లా సంచికలో మరో కథనం ప్రచురించింది. ఆ కథనం అధికారులను కదిలించింది. స్పందించిన ఐటీడీఎ పీఓ ఆర్.కూర్మనాథ్ గిరిజన పల్లెల్లో ఆ మరునాడే పర్యటించా రు. మరోవైపు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ఇటు ఐటీడీఎ పీఓతోనూ, అటు అటవీ శాఖ జిల్లా అధికారి చేతన్‌తోనూ చర్చించారు. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి సైతం స్పందించారు. గిరిజన గ్రామాల్లో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధప్రాతిపదికన చర్య లు చేపట్టాల్సిందిగా ఐటీడీఎ పీఓ కూర్మనాథ్‌ను ఆదేశించారు.
ఉపాధి హామీ నిధులు విడుదల
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఉపాధిహామీ పథకం జిల్లా కోఆర్డినేటర్ అయిన డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు మంజూరు చేశారు. సాక్షి కథనాన్ని తొలి రిఫరెన్స్‌గా తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కలెక్టర్ తరఫున ఐటీడీఎ పీఓ కూర్మనాథ్ రూ.1.65 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులపై మంగళవారం సంతకం చేశారు. చింతామల గ్రామం నుంచి ఒడిశా సరిహద్దు వరకూ రహదారి నిర్మాణానికి బుధవారం శంకుస్తాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పీఓ కూర్మనాథ్ ‘సాక్షి ప్రతినిధి’కి వెల్లడించారు.
గిరిజన ప్రాంతాభివృద్ధిపై వైఎస్ ముద్ర
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఆయన హఠాన్మరణం, తదితర కారణాలు వల్ల నిర్మాణం పూర్తికాలేదు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మా ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. అటవీ శాఖ కూడా అనుమతులు ఇచ్చే విషయంలో సానుకూలంగా ఉంది. దానికి నిదర్శనమే తాజాగా రూ.1.65 కోట్లు మంజూరు కావడం. ఈ రహదారితో పాటు గిరిజన ప్రాంతంలో మిగిలిన రోడ్లు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు.
రహదారుల కొరత తీరుస్తాం
గిరిజనులు పడుతున్న ఇబ్బందు లను రహదారుల నిర్మాణంతో కొంతైనా తీర్చగలుగుతాం. ఈ విషయంలో ఎలాంటి తాత్సారానికీ తావివ్వకుండా అన్ని అనుమతులు తీసుకుంటున్నాం. మరో రూ.11.62 కోట్లతో పోనంగి రహదారి నిర్మాణానికి కూడా చర్యలు చేపడుతున్నాం. అటవీశాఖ నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్‌లు కూడా వ స్తున్నాయి. అంతర్గత సీసీ రోడ్లు, చెక్ డ్యామ్‌ల నిర్మాణాలు కూడా పూర్తి చే స్తాం. ప్రభుత్వం నిధుల మంజూరుకు సిద్ధంగా ఉంది. – ఆర్.కూర్మనాథ్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఎ, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment