
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
– విద్యుదాఘాతంతో యువకుడి మృతి
– అధికారుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ
– తుంగతుర్తి మండల పరిధిలో ఘటన
తుంగతుర్తి :
అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తున్న యువకుడిని యమపాశాలుగా మారిన విద్యుత్ తీగలు బలితీసుకున్నాయి. తుంగతుర్తి మండలంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన వివరాలు.. మండలంలోని పస్తాల గ్రామానికి చెందిన తాడమల్ల ఏసుబాబు లలితల దంపతుల కుమారుడు అశోక్(20) నూతనంగా వేసిన విద్యుత్ స్తంభాలను ఎత్తి విద్యుత్ లైన్‌లు లాగడానికి కూలీగా వెళ్తున్నాడు. బుధవారం తిరుమలగిరి మండలం జలాల్ పురం సబ్ స్టేషన్ నుంచి తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి లూస్‌లైన్ స్తంభాలు ఎత్తివిద్యుత్ లైన్లు లాగడానికి వెళ్లాడు. స్తంభాలు నాటే క్రమంలో సబ్ స్టేషన్‌లో ఎల్‌సీ తీసుకుని లైన్లు లాగుతున్నారు. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతోఅశోక్ స్తంభంపైనే విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
గ్రామస్తుల ఆందోళన
విద్యుత్ పనులు చేస్తుండగానే జలాల్ పురం సబ్‌స్టేషన్‌లోని ఆపరేటర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ సరఫరా జరిగి అశోక్ మృతిచెందాడని లైన్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం, విద్యుత్ కాంట్రాక్టర్ తెలిపారు. యువకుడు మృతి చెందిన విషయం విద్యుత్ అధికారులకు తెలిసినాlరాకపోవడంతో ఆగ్రహించిన పస్తాల, గొట్టిపర్తి గ్రామస్తులు ధర్నాకు దిగారు. విద్యుత్ అధికారులు వచ్చి తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని స్తంభం మీది నుంచి కిందకు తీయమని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ట్రైనీ ఎస్సై ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చెరుకుని అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహంచారు. సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి తమకు సరైన న్యాయం చేస్తామని హామి ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మిన్నంటిన ఆర్తనాదాలు
చేతికి అంది వచ్చిన కుమారుడు మృతి చెందటంతో తల్లి తండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. రెక్కాడితే డొక్కాడని ఆ కుటుంబంలో తన కుమారుడు కూలి పనులపై సంపాదించిన డబ్బుతోనే కుటుంబం గడుస్తుంది. ఆ కుటుంబాన్ని విద్యుత్‌శాఖ అధికారులు ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గుడిపాటి నర్సయ్య, అన్నెపర్తి జ్ఞానసుందర్, తొడుసు లింగయ్య, కడారి వీరస్వామి, వెంకట్‌రెడ్డి, డిమాండ్ చేశారు.