కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం: గుంటూరు డీఐజీ
ఏలూరు అర్బన్: ఏలూరు మండలం మాదేపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గుంటూరు రేంజ్ డీఐజీ ఎన్.సంజయ్ శుక్రవారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నరసాపురంలో జరిగిన క్రిస్టియన్ సమావేశాల్లో మృతుడు జుజ్జవరపు ఉదయరాజు వీడియో చిత్రీకరణ చేశారని, రోజుపాటు తనతో సన్నిహితంగా మెలిగాడన్నారు. అలాంటి వ్యక్తి మృత్యువాత పడటం బాధ కలిగించిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నూతన పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించి గుంటూరు తిరిగి వెళ్తూ మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు నగరానికి వచ్చానని చెప్పారు. ప్రమాదానికి రోడ్డు మరమ్మతులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కనిపిస్తోందన్నారు. మరమ్మతులు చేసే చోట ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవని, వెలుగు లేకపోవడం కూడా కారణమన్నారు. అనంతరం సత్రంపాడులో ఉన్న మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పి.భాస్కరరావు, సీఐలు అడపా నాగమురళి, జి.మధుబాబు ఆయన వెంట ఉన్నారు.