
విజయకుమార్
తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడిన కోయంబత్తూరు రేంజ్ డీఐజీ విజయకుమార్(45) మృతిపై 8 మందిని విచారించేందుకు పోలీసులు
సాక్షి, చైన్నె: తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడిన కోయంబత్తూరు రేంజ్ డీఐజీ విజయకుమార్(45) మృతిపై 8 మందిని విచారించేందుకు పోలీసులు నిర్ణయించారు. కోయంబత్తూరు రామనాథపురం స్టేషన్‌లో జరిగే ఈ విచారణకు హాజరుకావాలని వీరికి ఆదివారం సమన్లు అందాయ. వివరాలు.. కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా ఈ ఏడాది జనవరిలో ఐపీఎస్ అధికారి విజయకుమార్(45) పదోన్నతి పొందిన విషయం తెలిసిందే.
ఈనెల 7వ తేదీన రేస్ కోర్సులోని క్యాంప్ కార్యాలయంలో ఆయన తన భద్రతా సిబ్బంది రవి వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమాచారం పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు, ఆరోపణలు బయలు దేరాయి. అయితే ఆయన తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా బలన్మరణానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. అయితే, సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు, ప్రత్యక్షంగా మరికొందరు ఈ వ్యవహారంపై అనుమానాలు, ఆరోపణలు గుప్పించారు.
ఈ పరిస్థితులలో కేసును విచారిస్తున్న కోయంబత్తూరు రామనాథపురం పోలీసులు అనుమానాలు, ఆరోపణలు గుప్పించిన వారిని విచారించేందుకు సిద్ధమయ్యాయి. తొలి విడతగా ఎనిమిది మందికి సమన్లు జారీ చేశారు. వీరు మంగళవారం తగిన ఆధారాలతో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.