రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి
Published Sun, Dec 18 2016 2:10 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
జంగారెడ్డిగూడెం : రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించామని ఏలూరు రేంజ్ డీఐజీ పి.వి.రామకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ భాస్కర్‌భూషణ్‌తో కలిసి ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు. తీసుకోవాల్సిన చర్యలపై ఓ ప్రణాళిక రూపొందించనున్నట్టు వివరించారు. దీనికోసం ఆర్‌అండ్‌బీ, హైవే అథారిటీ, ఇంజనీరింగ్ అధికారుల సహకారం కూడా తీసుకోనున్నట్టు చెప్పారు. వాహన చోదకులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఐజీ వెల్లడించారు. ఏలూరు రేంజ్ పరిధిలో మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదని డీఐజీ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు వైపు అక్కడక్కడ మావోయిస్టులు ఉన్నారని, చత్తీస్‌గఢ్ నుంచి వీరు వచ్చినట్లు సమాచారం ఉందని వివరించారు. ఇటీవల ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో వారు ప్రతీకార చర్యలకు పూనుకునే అవకాశం ఉందని, అందువల్ల అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. మావోయిస్టుల కదలికపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో కమ్యునిటీ పోలీసు వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఎస్పీ భాస్కర్‌భూషణ్ మాట్లాడుతూ కోడిపందేలపై త్వరలో ప్రత్యేక వివరణ ఇస్తామన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. కోర్టు ఉత్తర్వులు అందిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్సై ఎం.కేశవరావు, ట్రాఫిక్ ఎస్సై ఆనందరెడ్డి పాల్గొన్నారు.
Advertisement