ముప్పుతిప్పలు
ముప్పుతిప్పలు
Published Thu, Oct 6 2016 1:16 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
= ట్రైసైకిళ్ల పంపిణీలో నిర్లక్ష్యం
= కాళ్లరిగేలా తిరుగుతున్న దివ్యాంగులు
= కనికరం చూపని అధికారులు
= తుప్పుపట్టిపోతున్న 2,029 ట్రైసైకిళ్లు
= కేంద్రమంత్రి రిబ్బన్ కటింగ్ కోసం ఎదురుచూపులు
అనంతపురం అర్బన్ : దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీలో అంతులేని నిర్లక్ష్యం కన్పిస్తోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే మీ కోసం (గ్రీవెన్స్)లో దివ్యాంగులు అర్జీలు ఇస్తున్నారు. ప్రతి వారం పది మందికి తక్కువ కాకుండా వీటి కోసం వస్తున్నారు. వీరిలో చాలా మంది నాలుగైదు దఫాలు అర్జీలు ఇచ్చుకున్న వారే కావడం గమనార్హం. గతంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్‌ఐఎంసీఓ) ఆధ్వర్యంలో అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో శిబిరాలు నిర్వహించారు.
అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1,263 ట్రైసైకిళ్లు, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 766 ట్రై సైకిళ్లు పంపిణీ చేసేందుకు లబ్ధిదారులను గుర్తించారు. అదేవిధంగా 530 మందికి వీల్‌చైర్లు ఇచ్చేందుకు అర్హులను గుర్తించారు. ఈ మేరకు ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు నాలుగు నెలల క్రితమే జిల్లాకు వచ్చాయి. వీటిని అధికారులు స్థానిక బళ్లారి రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆవరణలో ఉంచారు. ఇవి ఎండకు ఎండుతూ, వానకు నానుతూ తప్పుపడుతున్నాయి. వీటిని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్æ చేతుల మీదుగా పంపిణీ చేయాల్సి ఉందని వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆయన అపాయింట్‌మెంట్ కోరుతూ జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి లేఖ వెళ్లిందని తెలిపారు. అక్కడి నుంచి ఎటువంటి సమాచారమూ రాలేదని, ఇందు కోసం తాము కూడా ఎదురుచూస్తున్నామని చెప్పారు.
ఇతని పేరు సుధాకర్. అనంతపురం నగరంలోని సోమనాథనగర్‌లో నివాసముంటున్నాడు. రెండు కాళ్లూ పనిచేయవు. ఎక్కడికైనా వెళ్లాలంటే మోకాళ్లపై దోకాలి. ట్రై సైకిల్ కోసం ఇప్పటికే పలుమార్లు అధికారులకు అర్జీలిచ్చాడు. అయినా ప్రయోజనం లేదు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీ కోసంలో కలెక్టర్‌కు మరోమారు అర్జీ సమర్పించాడు.
ఈమె పేరు మాబున్నీ. తాడిపత్రి మండలం నందలపాడు నివాసి. ఈమె రెండు కాళ్లూ పనిచేయవు. చంక కర్రల ఆధారంతో నడవాలి. ట్రైసైకిల్ కోసం చాలాసార్లు అర్జీ ఇచ్చింది. ఏ అధికారీ కనికరించలేదు. సోమవారం మీ కోసంలో కలెక్టర్‌కు మరోమారు అర్జీ ఇచ్చుకుంది. ‘ఈసారైనా వస్తుందో, రాదో! ఇంకెన్నిసార్లు తిరగాలో’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
వీరిద్దరు మాత్రమే కాదు.. జిల్లా వ్యాప్తంగా అనేక మంది దివ్యాంగులు ట్రైసైకిళ్లు (మూడు చక్రాల సైకిళ్లు) అందక అవస్థ పడుతున్నారు. కన్పించిన అధికారులందరికీ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అయినా వారి సమస్య తీరడం లేదు.
Advertisement