నుడా చైర్మన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
ప్రమాణస్వీకారంలో బాలకృష్ణ
నెల్లూరు(వీఆర్సీసెంటర్) : తెలుగుజాతి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు జన్మించిన నెల్లూరు జిల్లాకు ఘనమైన రాజకీయ చరిత్ర ఉందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. నుడా చైర్మన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా శుక్రవారం బాలకృçష్ణ నెల్లూరుకు విచ్చేశారు. బాలాజీనగర్‌లోని శ్రీనివాసులురెడ్డి నివాసానికి చేరుకున్న బాలకృష్ణ కాన్వాయ్‌తో వీఆర్‌సీ సెంటర్ వరకు వచ్చారు. అక్కడ నుంచి ర్యాలీగా ట్రంకురోడ్డు మీదుగా నర్తకీసెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో నుడా చైర్మన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాలక మండలి సభ్యులతో మంత్రులు నారాయణ, సోమిరెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ శ్రీనివాసులురెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి నెల్లూరుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
నెల్లూరుకు సింహపురి అనే మరో పేరు ఉందని, నెల్లూరును మనుమసిద్ది రాజుపాలించగా, తిక్కన ఆస్థాన కవి అని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు 1060 కి.మీ. విస్తీర్ణంతో నుడాను ఏర్పాటుచేయడం అభినందించదగ్గ విషయమన్నారు. కష్టపడ్డవారికి పార్టీలో గుర్తింపు ఉంటుందనేందుకు శ్రీనివాసులురెడ్డి నిదర్శనమన్నారు. మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌టీఆర్ కుటుంబంతో శీనయ్యకు మంచి సంబంధాలున్నాయని, భవిష్యత్‌లో నుడాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన కృషి చేస్తారన్నారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ నా దైవం బాలకృష్ణ అని, నేను ఇప్పటికీ సామాన్య కార్యకర్తగా ఉన్నానని, నాయకుడిగా ఎప్పుడూ భావించలేదన్నారు. కార్యక్రమంలో మేయర్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్, నాయకులు శ్రీధరకృష్ణారెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.
నెల్లూరుకు ఘనమైన చరిత్ర
Published Sat, Jul 1 2017 2:21 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement
Advertisement