పెండ్లిమర్రి: మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి(29) అనే యువకుడు శుక్రవారం రాత్రి వేప చెట్టుకు ఉరి వేసుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పిచ్చిరెడ్డి, రాములమ్మ దంపతుల రెండవ కుమారుడు శ్రీనివాసులరెడ్డి ఎంసీఏ పూర్తి చేసి బెంగళూరులోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండే వాడు. అతనికి వీరపునాయునిపల్లె మండలం సంగాలపల్లెకు చెందిన వధువుతో పెద్దలు ఆదివారం ఉదయం 7–30 గంటలకు పెళ్లి నిశ్చయించారు. వివాహానికి కడపలో ఉన్న సేహితున్ని పిలిచి, అలాగే షేవింగ్ చేయించుకుని వస్తానని చెప్పి ఇంటి దగ్గర నుంచి మల్లికార్జున శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. రాత్రి ఆలస్యం అయ్యే సరికి ఫోన్ చేయగా వస్తానులే అన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి ఫోన్ చేసి.. ‘యోగివేమన యూనివర్సిటీ వద్ద బైకు కింద పడింది. మీరు రావాలి’ అని చెప్పాడు. ఇంటి వద్ద నుంచి అతని అన్న సాంబశివారెడ్డి మరొకరు కలిసి వెళ్లగా అక్కడ కనిపించలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. వాళ్లు భయపడి కుటుంబ సభ్యులు, గ్రామంలో ఉన్న బంధువులకు చెప్పడంతో.. అందరూ కలిసి వెళ్లి వెతికారు. యూనివర్సిటీ సమీపంలోని పొలాల్లో వేప చెట్టుకు తాడుతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. వాళ్లు అక్కడికి వెళ్లి చూసే సరికి చనిపోయి ఉన్నాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుడే కొనుకొని తెచ్చిన కొత్త నోట్ పుస్తకం సంఘటన స్థలంలో స్కూటర్ వద్ద ఉంది. దానిని పరిశీలిస్తే ‘అమ్మను, అక్కను, పిల్లలను బాగా చూసుకోండి అన్నా. పెళ్లి కుమార్తె వాళ్లు చాలా మంచి వారు. ఈ పనికి ఎవరు కారణం కాదు’ అని సూసైడ్ నోట్‌లో రాశాడు. మృతదేహనికి కడప రిమ్స్‌లో శవ పంచనామా నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తి చేస్తున్నట్లు ఏఎస్‌ఐ విష్ణునారాయణ తెలిపారు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి...
మల్లికార్జునరెడ్డి వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి ఉన్నత చదువు చదివాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60 వేలు జీతం తీసుకుంటున్నాడు. సంతోషంగా గడిపే కుటుంబంలో ఒక్క సారిగా విషాధ చాయలు అలుముకున్నాయి. మృతునికి అమ్మ, అన్న, వదిన మాత్రమే ఉన్నారు. తండ్రి మూడేళ్ల క్రితం మృతి చెందాడు. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్న సాంబశివారెడ్డి కోమాలోకి వెళ్లాడు. అప్పుడు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు అయింది. తర్వాత కోలుకున్నాడు. ఇప్పుడు ఇలా జరగడంతో కుటుంబ సభ్యలు జీర్ణించుకోలేకున్నారు. మృతునికి పెళ్లి ఇష్టం లేకనో... లేక ఇతర కారణాలతోనో.. తన సమస్యలను ఇంట్లో చెప్పుకోలేక, చెప్పినా తీరవనుకొని అత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు.
నవ వరుడు ఆత్మహత్య
Published Sat, Aug 13 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
Advertisement
Advertisement