ఆలయ వీధుల్లో కొత్త ముత్యపు పందిరివాహనం ఊరేగింపు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారికి కొత్త ముత్యపు పందిరి వాహనాన్ని సిద్ధం చేశారు. దీనితోపాటు సూర్యప్రభ వాహనాన్ని అధికారులు మంగళవారం ప్రయోగాత్మకంగా పరిశీలించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు కొత్త ముత్యపు పందిరి వాహనం, సర్వభూపాల వాహనాలను కొలువుదీర్చేందుకు టీటీడీ సిద్ధమైంది. గతంలో ఈ వాహనాలపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగుతుండగా భక్తులకు అంతగా కనిపించేవారు కాదు. ఈ నేపథ్యంలో కొత్త వాహనాలను బర్మాటేకుతో సిద్ధం చేశారు. మంగళవారం ముత్యపు పందిరివాహనాన్ని పరిశీలించారు. అనంతరం తిరుపతి జ్యువెలరీ విభాగానికి తరలించి రాగిరేకుతో బంగారుమలాం చేయించనున్నారు. సర్వ భూపాల వాహనాన్ని త్వరలోనే పరిశీలించనున్నారు. వాహన సేవల్లో అత్యంత బరువైన సూర్యప్రభ వాహనాన్ని కూడా ముందుజాగ్రత్తగా పరిశీలించి లోటుపాట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో పారుపత్తేదారు జయరామ్‌నాయక్, బొక్కసం ఇన్‌చార్జి గురురాజు, ఏవీఎస్‌వో మల్లికార్జున్ పాల్గొన్నారు.