చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు? | Chaitra Masam Significance What Does Vasantha Navratri | Sakshi
Sakshi News home page

Chaitra Masam: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు?

Published Tue, Apr 9 2024 8:00 AM | Last Updated on Tue, Apr 9 2024 12:31 PM

Chaitra Masam Significance What Does Vasantha Navratri - Sakshi

“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు , దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. అంతటి విశిష్టత గల చైత్ర మాసంలో దాగున్న విశిష్టతలేంటో సవివరంగా తెలుసుకుందామా!.

ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు. చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది. ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లు, చేమలే కాదు, పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. ఏడాదికి యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది, ఉగాది అయ్యింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుంచి సంవత్సరాదిని జరుపుకుంటారు.

చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు. మనం సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాం. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు , రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు , మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి, నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి, చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది. రామాయణం లోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు , వనవాసానికి వెళ్ళటం , దశరథుని మరణం , సీతాపహరణం , రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం , శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి.

చైత్రంలో జరపుకునే పండుగలు..
చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి , మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు. చైత్ర శుద్ధ తదియ – డోలాగౌరీ వ్రతం(సౌభాగ్య గౌరీ వ్రతం), సౌభాగ్య శయన వ్రతం, ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి , డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు , చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది.

సౌభాగ్యాన్ని , పుత్రపౌత్రాదులను , భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ రోజు మత్స్య జయంతి కూడా. – శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి , వేదాలను రక్షించిన రోజు. చైత్ర శుద్ధ పంచమి – లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు పూజించాలి. అనంత , వాసుకి , తక్షక , కర్కోటక , శంఖ , కుళిక , పద్మ , మహాపద్మ అనే మహానాగులను పూజించి , పాలు , నెయ్యి నివేదించాలి. అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు.

శ్రీరామునిగా అవతరించిన రోజు..
శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది. ఒకవేళ చేయలేకపోయినా , శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది. చైత్ర శుద్ధ అష్టమి –భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి, అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది. చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి . శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈ రోజు ఊరూరా, వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు.

నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం. చైత్ర శుద్ధ ఏకాదశి – వరూధిన్యేకాదశి , కామద ఏకాదశి అని అంటారు. చైత్ర శుద్ధ పౌర్ణమి – స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది.

ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. చైత్ర బహుళ త్రయోదశి – యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు. ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు , ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని , రామాయణ సారాన్ని గ్రహించి  ఆచరించే యత్నం చేద్దాం. సీతారాముల కళ్యాణం చూసి తరిద్దాం. ఈ ఏడాది కొత్తగా అయోధ్యలో ఏర్పాటైన రామాలయంలో సీతా రాముల కళ్యాణం వైభవోపతంగా జరగనుండటం విశేషం. 

(చదవండి: Ugadi 2024 : ఈ ఏడాది ఉగాది పేరేంటి? ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement