ఇంటి వద్ద ప్రసవాలు జరగొద్దు
-
ఆస్పత్రుల్లో అయ్యేలా చూడాలి
-
లేకుంటే వైద్య సిబ్బందిపై చర్యలు
-
ఏడీఎంహెచ్‌వో ప్రభాకర్‌రెడ్డి
ఉట్నూర్ : ఏజెన్సీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో గర్భిణులు ఇంటి వద్ద కాకుండా ఆస్పత్రుల్లో ప్రసవం అయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఇంటి వద్ద ప్రసవాలు జరిగితే సంబందిత వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని క్లస్టర్ కార్యాలయంలో దంతన్‌పల్లి, శ్యాంపూర్, హస్నాపూర్, ఇంద్రవెల్లి, పిట్టబోంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మొదటి ఏఎన్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన గ్రామాల్లో ఇంటి వద్ద ప్రసవాలు జరగకుండా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ గిరిజన గర్బిణి ఆస్పత్రిలోనే ప్రసవం అయ్యేలా చూడాలన్నారు. గర్భిణిగా ఉన్నప్పటి నుంచే ఆ మహిళ ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటూ ఉండాలని సూచించారు. మాతాశిశు మరణాలు నివారించడంలో భాగంగా రవాణా సౌకర్యం లేని గిరిజన గ్రామాల్లోని గర్భిణులను ముందుగానే నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి తరలించాలని తెలిపారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఆస్పత్రి ప్రసవాలపై గిరిజన గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు.
వ్యాధులపై జాగ్రత్త
సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఎంహెచ్‌వో పేర్కొన్నారు. ఆశ కార్యకర్తలు గ్రామాల్లో జ్వర పీడితులకు రక్త పరీక్షలు నిర్వహిస్తే.. వారికి ఒక్కో పరీక్షకు రూ.75లు చెల్లిస్తున్నామని, వారు ఎన్ని పరీక్షలు నిర్వహించారో వివరాలు ప్రతీ నెల పదో తేదీలోపు రిపోర్టు చేయాలని, తద్వారా చెల్లింపులు సక్రమంగా ఉంటాయని వివరించారు. అలాగే ఇండోర్ రెసిడెన్షియల్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ దోమల నివారణ పిచికారి నిర్వహించారా లేదా వివరాలు సమర్పించాలన్నారు. దోమల ప్రాబల్యం ఉన్న గ్రామాల వివరాలు సమర్పిస్తే మలి విడత పిచికారి నిర్వహిస్తామని తెలిపారు. ఉట్నూర్ క్లస్టర్ పరిధిలో జేఎస్‌వై పథకం ద్వారా మరో 249 మంది లబ్ధిదారులకు చెల్లింపులు నిర్వహించాల్సి ఉందన్నారు. వారి పూర్తి వివరాలు సేకరించి చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. శ్యాంపూర్ వైద్యులు ఫాల్గుణ్, సీహెచ్‌వో ఉరుకుందా బాయి, ఏపీఎమ్ జైవంత్, హెచ్‌ఈవో వెంకటేశ్వర్లు, మొదటి ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.