పక్కాగృహాలేవి?!
- ఏమి అభివృద్ధి చేశారు
- టీడీపీ నేత పుత్తాను నిలదీసిన మహిళ
చింతకొమ్మదిన్నె/కడప : ’చేయనది చేసినట్లు...లేనిది ఉన్నట్లు’ చెప్పుకుంటూ జనచైతన్య యాత్రలు చేపడుతున్న టీడీపీ నాయకులకు ప్రజల నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. కమలాపురం నియోజకవర్గంలో గురువారం టీడీపీ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డిని ఓ మహిళ నిలదీసింది. మురుగు కాలువలు, సిమెంటు రోడ్లు లేక ముగురునీరు ఎక్కడికక్కడే పేరుకపోయింది. పక్కాగృహాలు ఇస్తామన్నారు, ఇంతవరకూ ఇవ్వలేదని తీవ్రస్వరంతో చెప్పారు. ఊహించని పరిణామానికి ఆవాక్కైన టీడీపీ నేత కోపోద్రిక్తుడై అమెపై మండిపడ్డారు.
చింతకొమ్మదిన్నె మండలం రోడ్డు కృష్ణాపురం గ్రామంలో గురువారం జన చైతన్యయాత్ర కార్యక్రమాన్ని టీడీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తుండగా అదే గ్రామానికి చెందిన దస్తగిరమ్మ అనే మహిళ మాట్లాడుతూ నాయకులందరూ అది చేశాం...ఇది చేశామంటూ వస్తూపోతున్నారే తప్పా చేసిందేమీ లేదన్నారు. పక్కా గృహం ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని టీడీపీ నేత పుత్తాను ఆమె నిలదీసింది. సర్దిచెప్పాల్సిన ఆయన కోపోద్రిక్తుడయ్యారు. ’’నేను మీ ఇంటికి గుమస్తాను కాను...మీరు చెప్పినవన్నీ చేసేందుకు ఇక్కడికి రాలేదు...మీకు నేను ఇల్లు కట్టిస్తానని ఏమైనా చెప్పానా...నోరుందని ఊరికే మాట్లాడకు... నాకూ నోరుంది...నేనూ గట్టిగా మాట్లాడగలను...’’...అని పుత్తా అనడంతో సభలో కొంత గందరగోళం నెలకొంది. స్థానిక టీడీపీ నాయకులు దస్తగిరమ్మను సభ నుంచి బయటికి పంపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్‌ఛార్జి గంధం మోహన్‌బాబు, ఎంపీపీ వెంకట సుబ్బారెడ్డి, సర్పంచ్ మహేంద్రారెడ్డి, ఎంపీటీసీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.