నిస్సహాయం..!
నిస్సహాయం..!
Published Mon, Aug 8 2016 12:15 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
– హెచ్‌ఐవీ బాధితులకు అందని ఆర్థిక చేయూత
– మూలుగుతున్న రూ.70 లక్షల నిధులు
– మంజూరై ఐదు నెలలైనా పట్టించుకోని అధికారులు
– ఆశగా ఎదురు చూస్తున్న బాధితులు
– గిరిజన కుటుంబాల దరిచేరని స్పెషల్ ప్రాజెక్టు
కర్నూలు(అర్బన్): తెలిసో... తెలియకో ... జరిగిన తప్పులకు వారు శిక్షను అనుభవిస్తున్నారు. పేదరికం.. నిరక్షరాస్యత కారణంగా వారు కోలుకోలేని జబ్బుకు గురయ్యారు. వారికి వచ్చిన జబ్బును ఎలాగూ నయం చేయలేం, కనీసం వారిపై ఆధారపడిన కుటుంబాలకైనా ఆర్థిక చేయూతనిద్దాం... అనే సంకల్పంతో చేపట్టిన కార్యక్రమం అమలు కావడం లేదు. దీంతో ఆయా కుటుంబాలు కన్నీరు కార్చడం తప్ప .. ఏమి చేయలేని నిస్సహాయ స్థితితో ఉన్నాయి.
జిల్లాలో హెచ్‌ఐవీ వ్యాధి బారిన పడిన గిరిజన కుటుంబాలకు అందించాల్సిన రూ.70 లక్షల నిధులు ఐదు నెలలుగా గిరిజన సంక్షేమ శాఖ బ్యాంకు ఖాతాలో మూలుగుతున్నాయి. దేవుడు వరమిచ్చినా..పూజారి కరుణించని చందంగా గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ నిధులను మంజూరు చేసినా, స్థానికంగా ఉన్న కారణాల వల్ల ఆ నిధులు బాధితులకు అందడంలో తీవ్ర జాప్యం నెలకొనింది. ఐటీడీఏ ప్లెయిన్ ఏపీఓ స్పెషల్ ప్రాజెక్టు కింద 2015 మార్చి నెలలో రాయలసీమ నాలుగు జిల్లాల్లోని గిరిజన గూడేలు, తండాలు, కాలనీల్లో ప్రత్యేక సర్వే నిర్వహించి జిల్లాలో 138 మంది గిరిజన వర్గాలకు చెందిన వారు హెచ్‌ఐవీ వ్యాధితో బాధ పడుతున్నారని గుర్తించారు. ఈ వ్యాధి బారిన పడిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష ( పూర్తి సబ్సిడీతో) మంజూరు చేయించేందుకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి నివేదికలను గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌కు పంపారు. ఈ నేపథ్యంలోనే మొదటి విడతలో 70 మందికి రూ.70 లక్షలను గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈ ఏడాది మార్చి 15వ తేదీన మంజూరు చేస్తూ బడ్జెట్‌ను విడుదల చేశారు. ఆ రోజు నుంచి నేటి వరక విడుదలైన రూ.70 లక్షలు బ్యాంకులో భద్రంగా ఉన్నాయే తప్ప బాధితులకు అందలేదు. మంజూరైన నిధులను అర్హులైన హెచ్‌ఐవీ బాధితులకు అందించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి కోరినా, ఫలితం ఇంతవరకు కనిపించలేదు.
డివిజన్ల వారీగా మంజూరు ....
జిల్లాలోని కర్నూలు డివిజన్‌లో 53 మంది, నంద్యాల డివిజన్‌లో 65 మంది, ఆదోని డివిజన్‌లో 20 మంది ప్రకారం మొత్తం 138 మంది గిరిజన వర్గాలకు చెందిన వారు హెచ్‌ఐవీ బారిన పడ్డారని నివేదికలు పంపారు. పంపిన నివేదికల ఆధారంగా మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.1 లక్ష ప్రకారం 70 మందికి రూ.70 లక్షలు ఆర్థిక సహాయం మంజూరైంది. కానీ ఇంతవరకు మంజూరైన వారికి ఆర్థిక సహాయం అందించక పోవడంతో ఆయా కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి.
కలెక్టర్‌కు ఫైల్ పెడుతున్నాం: హెచ్ సుభాషణ్‌రావు, డీటీడబ్ల్యూఓ
హెచ్‌ఐవీ వ్యాధి బారిన పడిన గిరిజనులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వారికి అందించేందుకు జిల్లా కలెక్టర్‌కు ఫైల్ పెడుతున్నాం. ఆర్థిక సహాయం మంజూరైన వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే బాధితులకు ఆర్థిక సహాయం అందుతుంది. సాధ్యమైనంత వరకు కష్ణా పుష్కరాలు ముగిసిన వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపడతాం.
Advertisement
Advertisement