కనికరం లేకుండా..
కనికరం లేకుండా..
Published Sun, Aug 21 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
పెద్దాసుపత్రిలో దారుణం
–అర్ధరాత్రి నిండు గర్భిణిని బయటకు తోశారు
–వైద్యం గురించి ఆరా తీసినందుకు..
–ప్రై వేటు ఆసుపత్రిలో ప్రసవం
కర్నూలు(హాస్పిటల్): పెద్ద పెద్ద డాక్టర్లుంటారని, ఎలాంటి శస్త్రచికిత్సలైనా సమయాభావం లేకుండా చేస్తారన్న నమ్మకంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వెళ్లిన ఓ నిండు గర్భిణికి చేదు అనుభవం ఎదురైంది. కష్టతరమైన ప్రసవ వేదనతో నరకయాతన అనుభవిస్తున్న ఆమెను అర్ధరాత్రి వైద్యులు నిర్ధాక్షిణ్యంగా బయటకు తోసేశారు. మీకు వైద్యం చేయం.. దిక్కున్న చోట చెప్పుకోండంటూ వెళ్లగొట్టారు. దీంతో ఆ గర్భిణి నగరంలోని ఓ ప్రై వేటు ఆసుపత్రిలో చేరి ప్రసవించింది. వివరాల్లోకి వెళితే..
డోన్‌కు చెందిన మనోహర్‌గౌడ్‌కు, వెల్దుర్తికి చెందిన రేవతికుమారికి ఏడాది క్రితం వివాహమైంది. మనోహర్‌గౌడ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్యం బాగుంటుందని భావించి ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రసవం కోసం రేవతికుమారిని చేర్పించారు. సాయంత్రం నుంచి నొప్పులు అధికం అవడం, బిడ్డ మెడకు పేగు చుట్టుకుపోతుండటంతో ప్రసవం కష్టంగా మారి నరకయాతన అనుభవించింది. ఆమె దీన పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయిన కుటుంబసభ్యులు విషయాన్ని వైద్యులకు చెప్పారు. కొద్దిగా సీరియస్‌గా పట్టించుకోండంటూ వేడుకున్నారు. మాకే ఎలాంటి వైద్యం చేయాలో చెబుతావా అంటూ వైద్యులు వారిని మందలించారు. మిమ్మలను ఎవరు లోపలికి రమ్మన్నారు...మగవాళ్లు రాకూడదని, సెక్యూరిటీని పిలిచి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసభ్యంగా మాట్లాడుతున్నారని, మీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వైద్యులు హెచ్చరించారు. ఇందుకు తామేమి తప్పుచేశామని వారు గట్టిగా నిలదీయడంతో వారి పేషంటును బయటకు పంపించి వేయాలంటూ సిబ్బందికి సూచించారు. ఆ వెంటనే రేవతికుమారితో పాటు ఆమె బ్యాగ్‌లను రాత్రి 2 గంటలకు బయటకు విసిరేశారు. అప్పటికప్పుడు వారు రేవతికుమారిని నగరంలోని ఓ ప్రై వేటు ఆసుపత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేయించారు. శనివారం ఉదయం 8.40 గంటలకు ఆమె సిజేరియన్ ద్వారా మగబిడ్డను ప్రసవించింది. తమలాంటి బాధ మరెవ్వరికీ రాకూడదని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, రోగులను గిచ్చి,కొట్టి,తిట్టే వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మనోహర్‌గౌడ్ కోరారు. కాగా ఈ విషయమై గైనకాలజి హెచ్‌వోడీ డాక్టర్ జ్యోతిర్మయిని వివరణ కోరగా గైనిక్ వార్డులోని ప్రసవ గదిలో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు గర్భిణిలు కాన్పు కోసం వచ్చి ఉన్నారని, రేవతికుమారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా మంచం కావాలని కోరగా, అలా కుదరదని వైద్యులు చెప్పడంతో, వారే ప్రై వేటుకు వెళ్లిపోయారని వివరించారు.
Advertisement