
హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీ రోడ్డుపై ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ సంఘటన శనివారం ఎల్‌బీనగర్‌లో చోటుచేసుకుంది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తారామతి పేటకు చెందిన మేరమ్మ అనే మహిళను కాన్పు నిమిత్తం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి బంధువులు తీసుకువచ్చారు. పండుగ కావడంతో ఏరియా ఆసుపత్రిలో వైద్యులు లేరని ప్రసవం కోసం వచ్చిన మహిళను ఆసుపత్రి సిబ్బంది తిప్పిపంపారు.
దీంతో మేరమ్మను ఆమె బంధువులు కోటి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో తీవ్రమైన నొప్పులు వచ్చాయి. కాసేపటికే ఎల్‌బీనగర్‌లో రోడ్డుపై ప్రసవించింది. అనంతరం అంబులెన్స్‌లో తల్లీ, పుట్టిన మగబిడ్డను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో ఏరియా ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంపై బాధితురాలి బంధువులు తీవ్రంగా మండిపడ్డారు.