![Woman And Newborn Death After School Dropout Performs C Section With Blade - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/20/blade.jpg.webp?itok=qnV_pEvP)
లక్నో: అంతులేని నిర్లక్ష్యం ఓ గర్భిణీతో పాటుగా, నవజాత శిశువు ప్రాణాలను బలితీసుకుంది. రిజిస్ట్రేషన్ లేని ఓ నర్సింగ్ హోమ్‌లో ఎనిమిదవ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి గర్భిణీకి డెలివరీ చేయాడానికి ప్రయత్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. రేజర్ బ్లేడ్‌తో ఆపరేషన్ చేయడంతో ఇలా జరిగింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్‌పూర్ జిల్లాలోని సైనీ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. నిందితుడిని 30 ఏళ్ల రాజేంద్ర శుక్లాగా గుర్తించారు. అతడు 8వ తరగతి వరకు చదివినట్టుగా తేలింది. వివరాలు.. రాజేశ్ సహనీ అనే వ్యక్తి స్థానికంగా మా శార్దా ఆస్పత్రి పేరుతో ఓ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నాడు. దానికి ఎలాంటి అనుమతులు లేవు. పైగా ఇందులో పనిచేసేందుకు ఎనిమిదవ తరగతి ఫెయిల్ అయిన రాజేంద్ర శుక్లా అనే వ్యక్తిని నియమించుకున్నాడు రాజేశ్.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాజారామ్ అనే వ్యక్తి తన భార్య పూనమ్ పురిటి నొప్పులతో బాధపడుతుంటంతో ఆమెను ఒక మంత్రసాని వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఆ మంత్రసాని డెలివరీ చేయడం తన వల్ల కాదని.. వెంటనే ఆమెని ఆరోగ్య కేంద్రానికి తరలించమని సలహా ఇచ్చింది. దాంతో అతడు పూనమ్‌ను రాజేష్‌కు చెందిన నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. అక్కడ అనుభవం లేని రాజేంద్ర శుక్లా పూనమ్‌కు చికిత్స అందించాడు. ఆపరేషన్ చేసేందుకు రేజర్ బ్లేడ్ వాడాడు. దీంతో పూనమ్‌కు గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. అనంతరం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించమని అక్కడివారు చెప్పారు.
అయితే సమీపంలో ఆస్పత్రులు లేకపోవడంతో రాజారామ్ తన భార్యను 140 కిలోమీటర్ల దూరంలో లక్నోలోని కేజీఎంయూ ట్రామా కేంద్రానికి తరలించాడు. అయితే తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఇక, ఈ ఘటనపై రాజారామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు రాజేంద్ర శుక్లా, రాజేష్ సాహ్నిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అక్రమ క్లినిక్‌లపై చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆరోగ్య కార్యదర్శికి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment