వామ్మో వాళ్ల స్పీడును ఎవ్వరూ చేరుకోలేరు..
వామ్మో వాళ్ల స్పీడును ఎవ్వరూ చేరుకోలేరు అంటున్నారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం నేతలు. ఇటీవల నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఆపార్టీని వీడారు. పచ్చ కండువా కప్పుకున్నారు. రాజకీయ అవసరాల కోసం ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరటాన్ని టీడీపీ నేతలు కూడా తప్పు పట్టడం లేదు. ఎందుకంటే వాటిని తమ అధినేత చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. ఈ ఇరువురు నేతలు టీడీపీలో చేరేందుకు విజయవాడలోని సీఎం నివాసానికి అలా బయలుదేరారో లేదో వెంటనే వారి నివాసాల్లో ఉన్న పాత ఫొటోలన్నింటినీ తొలగించేశారట.
ఏంటయ్యా ఇది అంటే మరి మనం పార్టీ మారాం కదా పాత వాసనలు ఎందుకని తీసి పక్కన పెట్టాం అని చెప్తున్నారట. వీరికంటే ముందు అధికార పార్టీలోకి జంప్ చేసిన ఓ నేత వామ్మో వాళ్ల స్పీడును నా బోటి వారు అందుకోలేరు..! నేను పార్టీ మారి ఏడాదిన్నర అవుతోంది. ఇంత వరకూ గతంలో ఉన్న పార్టీలోని నేతలతో తీయించుకున్న ఫొటోలను ఇప్పటికీ తీసేయలేదు. అవి మధురమైన జ్ఞాపకాలు. కండువాలు మార్చినపుడల్లా జ్ఞాపకాలు మార్చలేం కదా అని వ్యాఖ్యానించారు.