చంద్రబాబు ఎప్పుడు దిగిపోతారో?
విజయవాడ : ప్రజల్లో స్పందన చూస్తే చంద్రబాబు ఎప్పుడు వెళ్లిపోతారా? ఆయన ముఖ్యమంత్రి పదవినుంచి ఎప్పుడు దిగిపోతారా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని జిల్లా పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమం పార్టీ విజయానికి పెద్ద ఎత్తున దోహద పడుతుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఇది రాష్ట్ర భవిష్యత్‌కు తొలిమెట్టు అన్నారు.
జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన చెప్పిన మాటలేవీ కాపాడుకోలేకపోయారని, రైతులు, డ్వాక్రాసంఘాల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పక్కా గృహాలు ఇలా ఏ ఒక్క హామీ అమలు జరగలేదన్నారు. దివంతగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాలకు అతీతంగా ఇళ్లు, పెన్షన్, రాజీవ్ ఆరోగ్యశ్రీవంటి ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పకుండానే చేశారన్నారు. ఆ విధంగానే చంద్రబాబు చేస్తారని ఆలోచన చేసి ఓట్లు వేసిన వాళ్లంతా ఇవాళ చింతిస్తున్నారన్నారు.
గృహనిర్మాణం తీసుకుంటే ఎక్కడా కూడా ఇక్క ఇళ్లు నిర్మించలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 3 సెంట్ల స్థలం, 1.50 లక్షలతో ఇళ్లు నిర్మిస్తామని చెప్పారని గుర్తు చేశారు. రెండున్నరేళ్ల పాలనపూర్తయిందని, మిగిలిన రెండున్నరేళ్లలో ఆయన ఇచ్చిన హామీలు పూర్తిచేస్తారన్న నమ్మకం ప్రజల్లో లేదన్నారు. చంద్రబాబు మాత్రం తాను మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి అన్నీ చేసేశానని ప్రకటించుకుంటున్నారన్నారు. తాము చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్న ఆలోచన ప్రజల్లో ఉందన్నారు. 100 ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి చంద్రబాబుపై పాజిటివ్‌గా ఎవరూ జవాబు ఇవ్వడం లేదన్నారు.
చంద్రబాబుకు తెలిసే అవినీతి జరుగుతోంది...
కృష్ణా పుష్కరాల్లో ఘాట్లనిర్మాణానికి రూ. 1200 కోట్లు ఖర్చుచేస్తున్నారని, పనుల్లో అవినీతి జరుగుతోందని, నాణ్యతా లోపం ఉందన్న విషయం చంద్రబాబుకు ముందే తెలుసునని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత ఆగస్టు నుంచే పుష్కరాల పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కాలయాపన చేసి మేనెలలో పనులు ప్రారంభించారని ఆయన ఆరోపించారు. టెండర్లు పిలిచేందుకు సమయం లేదన్న సాకుచూపి నామినేషన్ పద్ధతిలో కోట్ల రూపాయలు టీడీపీ కార్యకర్తలు, నాయకులకు అప్పగిస్తున్నారన్నారు. రూ.1200 కోట్లలో వంద, రెండొందల ఖర్చు చేసి మిగిలిన మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు జేబుల్లో నింపుతున్నారన్నారు. పనుల్లో నాణ్యతాలోపం, సక్రమంగా జరగడం లేదని చెప్పడం ప్రజల్ని మోసగించేందుకేనన్నారు. నాణ్యతా లోపం ఉంటే ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
మంత్రిని తొలగించారా? లేక సంబంధిత అధికారిని సస్పైండ్ చేశారా? అని చంద్రబాబును నిలదీశారు. కృష్ణా పుష్కరాల పేరుతో నదీపరివాహక ప్రాంతంలోని దేవాలయాలను కూల్చివేస్తున్నారన్నాని, పురాతన దేవాలయాలు, పేదల ఇళ్లు కూల్చడం తప్పని చంద్రబాబు ఆలోచించడం లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి, నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, జిల్లా పరిషత్ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ బండి పుణ్యశీల, తూర్పు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తలు బొప్పన భవకుమార్, ఆసిఫ్, నగర అధికార ప్రతినిధి జానారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.