ఖరీఫ్ కు నో రిలీఫ్
♦ ఇన్‌పుట్‌సబ్సిడీ విడుదల చేయని సర్కారు
♦ గత సీజన్ పంటనష్టంపై నీలిమేఘాలు
♦ తొలకరి పలకరించినా కరుణించని ప్రభుత్వం
♦ పెట్టుబడుల్లేక రైతాంగం విలవిల
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అన్నదాతలకు ప్రభుత్వం మరోసారి రిక్తహస్తం చూపింది. కష్టకాలంలో రైతులకు చేయూతనివ్వకుండా దగా చేసింది. గత ఏడాది పంట నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వకపోవడంతో వారు దిక్కులు చూస్తున్నారు. చేతిలో కనీస పెట్టుబడులు లేక అప్పు కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో గతేడాది ఖరీఫ్‌లో పంటలు తుడుచిపెట్టుకు పోయాయి. ఆశించిన స్థాయిలో వర్షాపాతం నమోదుకాకపోవడంతో ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం కూడా నమోదు కాలేదు. సాధారణంగా ఖరీఫ్‌లో 2.19 లక్షల ఎకరాల మేర సాగులోకి రావాల్సివుండగా, కేవలం 2 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చింది.
అయితే సకాలంలో వర్షాలు కురవకపోవడంతో లక్ష ఎకరాల మేర పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో పంట పెట్టుబడి రాక ైరె తాంగం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణం, నష్టంపై అంచనాలను రూపొందించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వే చేసిన వ్యవసాయశాఖ జిల్లావ్యాప్తంగా 2,03,275 మంది రైతులు వేసిన 1,00,931.7 ఎకరాల మేర పంటలు ఎండిపోయాయని లెక్క తేల్చింది. తద్వారా రూ.73.33 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. ఈ మేరకు పంటనష్టం (ఇన్‌పుట్ సబ్సిడీ)ని అందజేయాలని ప్రభుత్వానికి నివేదించింది.
జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా అంగీకరించిన సర్కారు.. మళ్లీ ఖరీఫ్ దరిచేరుతున్నా నయా పైసా విదిల్చకపోవడం గమనార్హం. ఇన్‌పుట్ సబ్సిడీని పంపిణీతో రైతాంగానికి చేయూతనిచ్చి భరోసా నివ్వాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అడుగువేయడంలేదు. గతేడాది సకాలంలో వానలు పడకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోగా.. ఈ ఏడాది ఇప్పటికే తొలకరి పలకరించింది. వాతావరణశాఖ కూడా ఈసారి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్‌పుట్ సబ్సిడీని అందజేస్తే అంచనాలకు మించి విస్తీర్ణం సాగులోకి వచ్చేది. మే మొదటి వారం నుంచే రికార్డుస్థాయిలో జల్లులు కురుస్తుండడంతో భూగర్భజ లాలు కూడా వృద్ధి చెందుతున్నాయి.
అయితే. రెండేళ్లుగా వరుస కరువుతో రైతాంగం దారుణంగా నష్టపోయింది. ఆఖరికి నమ్ముకున్న పశువులకు గ్రాసం వేయలేక.. వాటిని సాకలేక సంతకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేసమయంలో వ్యవసాయ పనుల్లేక పొట్టచేత బట్టుకొని వలస బాట పట్టాల్సి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతాంగం దుక్కులు దున్నేందుకు సైతం డబ్బులేని పరిస్థితి ఉంది. కనీసం ప్రభుత్వం ప్రకటించిన ఇన్‌పుట్ సబ్సిడీని విడుదలచేస్తే.. ఖరీఫ్ పంటలకు ఊతమిచ్చినట్లవుతుంది.